Pawan Kalyan: ఒకే రాకెట్ తో పది ఉపగ్రహాలను రోదసిలోకి పంపి అద్భుత విజయం సాధించారు: పవన్ కల్యాణ్

  • శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగికెగిసిన పీఎస్ఎల్వీ సీ-49
  • శాస్త్రవేత్తలను అభినందించిన పవన్ కల్యాణ్
  • ఎంత కొనియాడినా తక్కువేనంటూ వ్యాఖ్యలు
Pawan Kalyan lauds ISRO scientists for PSLV success

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఒకే రాకెట్ తో 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి అద్భుత విజయాన్ని సాధించారంటూ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భారత శక్తి సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి చాటిన ఇస్రో శాస్త్రవేత్తలను ఎంత కొనియాడినా తక్కువేనంటూ వ్యాఖ్యానించారు.

నేటి మధ్యాహ్నం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుండి నింగికి ఎగిసిన పీఎస్ఎల్వీ సీ-49  రాకెట్ ఒక దేశీయ, 9 విదేశీ ఉపగ్రహాలతో పాటు 135 కోట్ల మంది భారతీయుల ఆశలను కూడా అంతరిక్షానికి తీసుకెళ్లడం దేశ ప్రజలందరికీ సంతోషకరమైన విషయం అని వివరించారు.

దేశ వ్యవసాయ అభివృద్ధి, రైతుల ప్రయోజనాల కోసం మన శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని ప్రయోగించడం హర్షణీయమని పవన్ పేర్కొన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసేన తరఫున శుభాభినందనలు తెలుపుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

More Telugu News