China: భారత్-చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు.. రెచ్చగొడితే యుద్ధం తప్పదన్న రావత్!

  • నిన్న ఉదయం ప్రారంభమై సాయంత్రం ముగిసిన చర్చలు
  • వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనిక దళాల ఉపసంహరణే లక్ష్యంగా చర్చలు
  • చైనా, పాక్‌లు కలిసి ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయన్న రావత్
Negotiations between India and China Over border disputes

భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను సడలించేందుకు ఇరు దేశాల మధ్య జరుగుతున్న కమాండర్ స్థాయి చర్చల్లో భాగంగా నిన్న ఎనిమిదో దఫా చర్చలు ప్రారంభమయ్యాయి. ఈసారి తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత భూభాగంలోని చుషూల్ వద్ద ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదలైన చర్చలు రాత్రి ఏడు గంటలకు ముగిశాయి. భారత బృందానికి లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నేతృత్వం వహించారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగినట్టు అధికారులు తెలిపారు. తూర్పు లడఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనిక దళాలను వెనక్కి తీసుకోవడం, సైనికుల ఉపసంహరణపై రోడ్‌మ్యాప్ ఖరారు చేయడం వంటివాటిపై ప్రధానంగా చర్చలు జరిగాయి.
 
కాగా, భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, కాబట్టి యుద్ధానికి దారితీసే అవకాశాలను తోసిపుచ్చలేమని అన్నారు. తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా ఆర్మీ దుస్సాహసానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా బలగాలను భారత్ సమర్థంగా ఎదుర్కొంటుండడంతో చైనాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్నారు. చైనా, పాక్‌లు కలిసి ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయని బిపిన్ రావత్ ఆరోపించారు.

More Telugu News