River Tungabhadra: ఈ నెల 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు.. అధికారుల్లో గందరగోళం!

Tungabhadra Pushkaralu starts from 20th november
  • చురుగ్గా పుష్కరఘాట్ల నిర్మాణం
  • పుష్కరాలకు ఆసక్తి చూపని తెలంగాణ, కర్ణాటక
  • స్నానాలకు స్లాట్ల బుకింగ్ ప్రతిపాదన
ఈ నెల 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంద్ర ప్రదేశ్ అధికారుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పుష్కరాల కోసం ఘాట్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభించినప్పటికీ అసలు స్నానాలకు అనుమతి ఇస్తారా? లేదా? అన్నదానిపై అధికారుల్లో స్పష్టత కరవైంది.

కరోనా నేపథ్యంలో ఎటూ తేల్చుకోలేక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఏపీలో కరోనా కేసులు కొనసాగుతుండడం, దీనికి తోడు ప్రస్తుతం శీతాకాలం కావడంతో రెండో దఫా వ్యాప్తి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్కరాల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

పుష్కరాల నేపథ్యంలో భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తూనే వారిని నియంత్రించాలనుకోవడం కుదరనిపని అని కొందరు అధికారులు చెబుతున్నారు. దసరా సందర్భంగా ఇటీవల కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో కర్రల సమరాన్ని నిషేధించారు. దానిని అడ్డుకునేందుకు 1500 మంది పోలీసులను మోహరించారు. అయినప్పటికీ అడ్డుకోలేకపోయారని, పుష్కరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.

 కాగా, అదే సమయంలో తుంగభద్ర నది ప్రవహించే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు మాత్రం కరోనా కారణంగా పుష్కరాలకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. దీంతో ఏపీలో కనుక పుష్కరాలు నిర్వహిస్తే ఆ రెండు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని, అప్పుడు మరింత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, 2008 పుష్కరాలకు కర్నూలు జిల్లాలకు దాదాపు 80 లక్షల మంది భక్తులు తరలివచ్చారు.

మరోవైపు, భక్తుల పుణ్యస్నానాల ఆచరణ విషయంలో మరో ప్రతిపాదనను కూడా అధికారులు తెరపైకి తెస్తున్నారు. ఆన్‌లైన్‌లో సమయాన్ని నమోదు చేసుకోవడం ద్వారా నిర్దిష్ట సమయంలో భక్తులు స్నానం చేసి వెళ్లేలా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అలా చేస్తే భౌతిక దూరం వంటి ఇతర ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. ఈ విషయంలో మరో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది. కర్నూలు జిల్లాలో 21 చోట్ల పుష్కర ఘాట్లను అధికారులు నిర్మిస్తున్నారు. కాగా, తుంగభద్ర పుష్కరాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రిని కూడా మంత్రాలయ పీఠం ఇప్పటికే ఆహ్వానించింది.
River Tungabhadra
Kurnool District
Pushkaralu
Telangana
Karnataka
Andhra Pradesh

More Telugu News