Denmark: కొత్త మార్పులు సంతరించుకుంటున్నకరోనా వైరస్.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

  • డెన్మార్క్‌లో మింక్ అనే జీవి ద్వారా కొత్త రకం కరోనా వైరస్
  • నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలు
  • విస్తృతంగా వ్యాపిస్తే వ్యాక్సిన్లు కూడా పనిచేయవని ఆందోళన
new covid mutation in denmark

కరోనా వైరస్ పరివర్తన చెందుతున్నట్టు ఇప్పటికే గుర్తించిన శాస్త్రవేత్తలు ఇప్పుడు మరో హెచ్చరిక చేశారు. వైరస్‌లో సరికొత్త మార్పులు కనిపిస్తున్నాయని, ఈ మార్పు తర్వాత వైరస్ కనుక విస్తృతంగా వ్యాపిస్తే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న టీకాలు ఎందుకూ కొరగాకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు.

డెన్మార్క్‌లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్టు స్టేటెన్స్ సీరమ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తల హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం వందల కొద్దీ మింక్ ఫారాలు ఉన్న జూట్‌ల్యాండ్‌లో ఆంక్షలు విధించింది. అలాగే, ఉత్తర డెన్మార్క్‌లో నేటి నుంచి కొవిడ్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రధాని మెట్టి ఫ్రెడ్రెక్సన్ తెలిపారు. అక్కడ నివసించేవారు ఎటువంటి ప్రయాణాలు చేయవద్దని, దీనిని ఉల్లంఘిస్తే కనుక వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

జూట్‌ల్యాండ్ ప్రాంతంలో దాదాపు 1,100 పెంపుడు కేంద్రాల్లో 1.7 కోట్ల మింక్‌లను పెంచుతున్నారు. 207 కేంద్రాల్లో కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించారు. వీటి వల్ల మొత్తం మింక్‌లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఐదు మింక్ కేంద్రాల్లో 12 మంది ఈ కొత్తరకం వైరస్ బారినపడ్డారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 214 మందికి ఇది సోకింది.

More Telugu News