SRH: క్వాలిఫయర్స్-2లోకి దూసుకెళ్లిన సన్ రైజర్స్... ఎలిమినేటర్ లో బెంగళూరు ఔట్

Sunrisers rams into qualifiers two by beating RCB in IPL eliminator
  • ఎలిమినేటర్ మ్యాచ్ లో 6 వికెట్లతో నెగ్గిన హైదరాబాద్
  • కీలక ఇన్నింగ్స్ ఆడిన హోల్డర్, విలియమ్సన్
  • ఎల్లుండి క్వాలిఫయర్-2
  • ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనున్న సన్ రైజర్స్            
డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో విజేతగా నిలిచింది. రాయల్ చాలెంజర్ బెంగళూరుతో అబుదాబిలో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో నెగ్గి క్వాలిఫయర్స్-2లోకి దూసుకెళ్లింది.

ఆఖర్లో వరుసగా రెండు బంతులను బౌండరీలుగా మలిచిన ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ సన్ రైజర్స్ కు అద్భుత విజయాన్ని అందించాడు. అసలీ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఇక్కడి వరకు వచ్చిందంటే అందుకు కారణం కేన్ విలియమ్సన్ బ్యాటింగే. విలియమ్సన్ 50 పరుగులు చేయగా, హోల్డర్ 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. 132 పరుగుల విజయలక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ 19.4 ఓవర్లలో ఛేదించింది.

బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2, జంపా, చహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. స్వల్ప లక్ష్యఛేదనే అయినా సన్ రైజర్స్ ఇన్నింగ్స్ కుదుపులకు లోనైంది. ఆరంభంలో ఓపెనర్ గోస్వామి సున్నా పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ వార్నర్ (17) కూడా నిరాశపరిచాడు. మనీష్ పాండే 24 పరుగులు చేయగా, ప్రియమ్ గార్గ్ 7 పరుగులు చేశాడు. మొత్తమ్మీద ఈ విజయంలో క్రెడిట్ అంతా కేన్ విలియమ్సన్, జాసన్ హోల్డర్ లకే దక్కుతుంది.

ఇక, ఎలిమినేటర్ లో నెగ్గిన వార్నర్ సేన క్వాలిఫయర్-2 మ్యాచ్ కు అర్హత సాధించింది. ఎల్లుండి జరిగే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ క్వాలిఫయర్-2లో విజయం సాధించిన జట్టు ఫైనల్లో ముంబయి ఇండియన్స్ తో తలపడనుంది.

కాగా, ఐపీఎల్ ఎలిమినేటర్ లో అద్భుత విజయం అందుకున్న సన్ రైజర్స్ జట్టును తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందించారు. "కంగ్రాచ్యులేషన్స్ సన్ రైజర్స్... వెల్ డన్. కప్ ను ఇంటికి తీసుకురావడానికి మరో రెండు మ్యాచ్ ల దూరంలో ఉన్నారు" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
SRH
RCB
Eliminator
Qualifier-2
Abudhabi
IPL 2020

More Telugu News