Cancer Patient: ఎలాంటి లక్షణాల్లేవు, పైగా క్యాన్సర్ పేషెంట్... 105 రోజులు కరోనాతో సహజీవనం!

  • అమెరికాలో విచిత్రం
  • బ్లడ్ క్యాన్సర్ రోగికి సోకిన కరోనా
  • శరీరంలో స్తబ్దుగా ఉండిపోయిన వైరస్
Cancer patient along with corona for hundred more days

కరోనా వైరస్ ఏడాది కాలంగా ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తోంది. ఇప్పటికీ వైరస్ ను ఎదుర్కొనే వ్యాక్సిన్ రాలేదు సరికదా, నిర్దిష్టమైన ఔషధాలు కూడా లేవు. ఇతర వ్యాధుల్లో ఉపయోగించే మందులనే కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఓవైపు కేసుల సంఖ్య ఇప్పటికీ కట్టడి కావడంలేదు. యూరప్ దేశాల్లో రెండో తాకిడి (సెకండ్ వేవ్) కూడా ప్రారంభమైంది. ఇప్పటికీ కరోనా తీరుతెన్నులు అంచనా వేయడంలో పరిశోధకులు పూర్తిగా సఫలమయ్యారని చెప్పలేని పరిస్థితి ఉంది.

సాధారణంగా కరోనా వైరస్ మానవుడిలో 8 రోజుల వరకు ఉంటుంది. అయితే అమెరికాలో ఓ బ్లడ్ క్యాన్సర్ పేషెంటులో అసాధారణ రీతిలో కరోనా వైరస్ 105 రోజుల పాటు ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. మరింత ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే... ఆ క్యాన్సర్ పేషెంటు కరోనా పాజిటివ్ వ్యక్తిగా ఉన్నా, దాదాపు 70 రోజుల పాటు ఎలాంటి లక్షణాలు లేవట. పైగా ఆ రోగి 71 సంవత్సరాల ఓ వృద్ధురాలు.

అమెరికాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజస్ సంస్థ ఓ అధ్యయనం చేపట్టింది. ఈ సంస్థకు చెందిన విన్సెంట్ మున్ స్టర్ అనే వైరాలజిస్ట్ మాట్లాడుతూ.... తాము అధ్యయనం ప్రారంభించిన సమయంలో కరోనా వైరస్ మనిషి దేహంలో ఎంతకాలం ఉంటుందనే అంశంలో అవగాహన లేదని తెలిపారు. ఆమెలో కరోనాను ఎదుర్కొనేందుకు యాంటీబాడీలు ఉత్పత్తి కాకపోవడంతో వైరస్ పై శరీరం పోరాటం ప్రారంభించలేదని, దాంతో కరోనా వైరస్ ఆమె శరీరంలో స్తబ్దుగా ఉండిపోయిందని వివరించారు.

More Telugu News