ఐపీఎల్ ఎలిమినేటర్: టాస్ గెలిచిన సన్ రైజర్స్... గాయంతో తప్పుకున్న సాహా

06-11-2020 Fri 19:20
  • ఐపీఎల్ లో నేడు ఎలిమినేటర్ మ్యాచ్
  • అబుదాబిలో సన్ రైజర్స్ వర్సెస్ బెంగళూరు
  • సాహా స్థానంలో జట్టులోకొచ్చిన గోస్వామి
Sunrisers won the toss in IPL eliminator

ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగే ఈ కీలక పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు.

కాగా, సూపర్ ఫామ్ లో ఉన్న వృద్ధిమాన్ సాహా ఈ మ్యాచ్ కు దూరమవడం సన్ రైజర్స్ కు తీరని లోటు అని చెప్పాలి. సాహా స్థానంలో గోస్వామి జట్టులోకొచ్చాడు. అతడు సాహా లేని లోటు ఎంతమేరకు తీరుస్తాడన్నది సందేహమే.

ఇక, బెంగళూరు జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. క్రిస్ మోరిస్ గాయం కారణంగా తప్పుకున్నాడు. పెద్దగా రాణించని జోష్ ఫిలిప్పే, షాబాజ్ అహ్మద్ లను పక్కనబెట్టారు. ఇసురు ఉదనకు తుది జట్టులో స్థానం లభించలేదు. ఆరోన్ ఫించ్, ఆడమ్ జంపా, నవదీప్ సైనీ, మొయిన్ అలీ జట్టులోకొచ్చారు. కాగా, 'ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇక ఇంటికే' అన్న నేపథ్యంలో ఇరుజట్లు హోరాహోరీగా పోరాడడం ఖాయంగా కనిపిస్తుంది.