Sunrisers Hyderabad: సన్ రైజర్స్, బెంగళూరు జట్లకు చావోరేవో!.... ఐపీఎల్ లో నేడు ఎలిమినేటర్

  • ప్లేఆఫ్స్ దశలో ఐపీఎల్ పోటీలు
  • అబుదాబిలో నేడు కీలక మ్యాచ్
  • గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో ఢిల్లీతో అమీతుమీ
Sunrisers Hyderabad takes on Royal Challengers Banglore in IPL eliminator

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఇవాళ అబుదాబి వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడుతుంది. ఢిల్లీ జట్టు నిన్న జరిగిన క్వాలిఫయర్-1లో దారుణ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో ఢిల్లీని చిత్తు చేసిన ముంబయి ఘనంగా ఫైనల్లో ప్రవేశించింది.

నేటి ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే... పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ కు, నాలుగో స్థానంలో ఉన్న బెంగళూరుకు మధ్య సంకుల సమరం అని చెప్పాలి. ఇరుజట్లలోనూ ధాటిగా ఆడే ఆటగాళ్లతో పాటు నాణ్యమైన బౌలర్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగనుంది. టాస్ మరోసారి కీలకం కానుంది. ఆర్సీబీ జట్టులో కెప్టెన్ కోహ్లీతో పాటు యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ సత్తా చాటుతున్నారు. బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్, చహల్, క్రిస్ మోరిస్ తదితరులు రాణిస్తున్నారు.

హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ప్రధానంగా వార్నర్, సాహా, మనీశ్ పాండేలపై ఆధారపడుతోంది. కేన్ విలియమ్సన్ ఇప్పటివరకు స్థాయికి తగ్గట్టుగా ఆడకపోవడం సన్ రైజర్స్ శిబిరాన్ని కలవరపెడుతోంది. బౌలింగ్ లో మాత్రం ఆ జట్టు వనరులు మెరుగ్గా ఉన్నాయి. రషీద్ ఖాన్ కు తోడు సందీప్ శర్మ, నటరాజన్ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నారు.

సన్ రైజర్స్ మిడిలార్డర్ కొంచెం బలహీనంగా అనిపిస్తోంది. సమద్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మలో నిలకడ లోపించింది. అటు బెంగళూరు జట్టుదీ ఇదే సమస్య! కోహ్లీ, పడిక్కల్, డివిలియర్స్ తర్వాత స్థిరంగా ఆడేవాళ్లు కరవయ్యారు.

More Telugu News