Amit Shah: ఆదివాసీ కార్యకర్త ఇంట భోజనం చేసిన అమిత్ షా... మెనూ ఇదే!

  • పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న హోమ్ మంత్రి
  • నేలపై కూర్చుని భోజనం చేసిన బీజేపీ నేతలు
  • తనకు లభించిన అదృష్టమన్న విభీషణ్ హన్సడా
Amit Shah Meals inTribal BJP Worker

పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన వేళ, బీజేపీ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, పార్టీకి చెందిన ఓ ఆదివాసీ కార్యకర్త ఇంట భోజనం చేశారు. అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గియా, జాతీయ ఉపాధ్యక్షుడు ముఖుల్ రాయ్, రాష్ట్ర పార్టీ చీఫ్ దిలీప్ ఘోష్ లు సైతం అక్కడే భోజనం చేశారు. తన అభిమాన నేతలకు భోజన సదుపాయాలను కల్పించే అవకాశం వీభీషణ్ హన్సడా అనే కార్యకర్తకు లభించింది.

నేతల కోసం పూర్తి శాకాహార విందును ఏర్పాటు చేసిన విభీషణ్, అరిటాకులో వాటిని వడ్డించగా, నేతలంతా నేలపైనే కూర్చుని భోజనం చేశారు. అన్నం, పప్పు, పటోలా భాజా, షుక్తో, ఆలూ పోస్టో, పాపడ్ తదితరాలతో పాటు రసగుల్లా, సందేశ్, మిష్టీ డోయి వంటి స్వీట్స్ ను వడ్డించారు. అయితే, అమిత్ షా డెజర్ట్స్ ను మాత్రం తీసుకోలేదు.

భోజనం అనంతరం, అమిత్ షా ఆ కార్యకర్త కుటుంబ సభ్యులను పలకరించారు. స్థానికులతో కాసేపు మాట్లాడారు. అమిత్ షా వంటి నేత తన ఇంటికి వచ్చి భోజనం చేయడం, తనకు లభించిన అదృష్టమని, ఇది తన జీవితాంతం గుర్తుండిపోతుందని హన్సడా వ్యాఖ్యానించారు.

More Telugu News