Kerala: విస్తరిస్తున్న మహమ్మారికి అడ్డుకట్టగా... కఠినమైన చట్టాలను ప్రయోగించిన కేరళ!

  • రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
  • సెక్షన్ 144, 149, 151లను ప్రయోగించిన కేరళ
  • అధికార దుర్వినియోగం జరుగుతుందంటున్న నిపుణులు
Kerala Draconian Acts on Pandamic

రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ, మహమ్మారి విస్తరణను అడ్డుకునేందుకు పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ సర్కారు కఠినమైన చట్టాలను ప్రయోగించి, మరోసారి మిగతా రాష్ట్రాల దృష్టిలో పడింది. కరోనాను అడ్డుకునేందుకు ఇటువంటి కఠిన చట్టాలు అవసరమా? అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సీఆర్పీసీ సెక్షన్ 144తో పాటు, సెక్షన్ 151, 149 తదితరాలను విధించింది. ప్రజలు గుమి కూడటాన్ని, ఏదైనా కార్యక్రమాలకు పెద్దఎత్తున హాజరు కావడాన్ని అడ్డుకునేందుకే ఈ చట్టాలను ప్రయోగిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

కాగా, సెక్షన్ 151, 149 అమలులో ఉన్న వేళ, పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తే, మెజిస్ట్రేట్ అనుమతి లేదా వారంట్ లేకుండానే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయవచ్చు. ఆపై వారిని ఒక రోజు కస్టడీలో ఉంచవచ్చు. అవసరమైతే, దాన్ని పొడిగించవచ్చు. సెక్షన్ 144 అమలులో ఉంటే, ముగ్గురి కన్నా అధికంగా ఒక ప్రాంతంలో గుమికూడరాదు. వాస్తవానికి ఈ సెక్షన్లను అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు వినియోగిస్తుంటారు.

ఈ చట్టాలు అమలులో ఉన్న వేళ, నిబంధనలను ఉల్లంఘిస్తే, గరిష్ఠంగా రెండు సంవత్సరాల వరకూ జైలుశిక్ష విధించేందుకు వీలుంటుంది. ఇక, కేరళ తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయ నిపుణులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా నివారణకు ఈ సెక్షన్ల ప్రయోగం అవసరం లేదని భావిస్తున్నారు. ఈ చట్టాల అమలు సమయంలో తమ అధికారాలను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని, ప్రజల స్వేచ్ఛ హరిస్తుందని అంటున్నారు.

More Telugu News