Missing Cases: తెలంగాణలో మిస్సింగ్ కేసులు పెరిగిపోతుండడంపై హైకోర్టు ఆగ్రహం

  • 2014-2019 మధ్యకాలంలో 8 వేల మిస్సింగ్ కేసులు
  • బలహీన వర్గాల కేసులే అధికంగా ఉన్నాయన్న పిటిషనర్
  • ప్రభుత్వ ప్రణాళికేంటో చెప్పాలన్న హైకోర్టు
  • డిసెంబరు 3 లోగా నివేదిక ఇస్తామన్న ఏజీ
Telangana high court responds in missing cases

తెలంగాణలో మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం పట్ల హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇవాళ ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 8 వేల మిస్సింగ్ కేసులు నమోదు కాగా, వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారి కేసులే ఎక్కువగా ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం మిస్సింగ్ కేసులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించింది. అందుకు ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ, మిస్సింగ్ కేసులపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. షీ టీమ్, దర్పణ్ యాప్, ఆపరేషన్ ముస్కాన్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ సాయంతో చర్యలు తీసుకుంటున్నట్టు వివరణ ఇచ్చారు.

అందుకు హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, మిస్సింగ్ కేసులపై ప్రభుత్వ ప్రణాళిక ఏంటో చెప్పాలని కోరింది. డిసెంబరు 3 లోగా నివేదిక అందిస్తామని ఏజీ విన్నవించగా, డిసెంబరు 10కి తదుపరి విచారణ వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.

More Telugu News