Amaravati: గత ప్రభుత్వ అన్ని చర్యలపై కమిటీలు వేశారా?: అమరావతి భూముల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్న

  • రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ పై స్టే విధించిన హైకోర్టు
  • సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • వర్ల రామయ్యకు, సిట్ కు సుప్రీం నోటీసులు
Supreme court adjours CRDA case to 4 weeks

అమరావతి భూముల అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలను వినిపించారు.

సీఆర్డీఏ పరిధిలోని భూముల అంశంలో అవకతవకలు జరిగాయంటూ కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందని దవే చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా అవినీతిపై దర్యాప్తు చేసేందుకు సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. సిట్ దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే హైకోర్టు స్టే ఇచ్చిందని... ఇది సరికాదని అన్నారు.

ఈ సందర్భంగా జస్టిస్ అశోక్ భూషణ్ కల్పించుకుని... గత ప్రభుత్వ అన్ని చర్యలపై కమిటీలు వేశారా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అవకతవకలు జరిగాయని భావించిన అంశాలపై మాత్రమే కమిటీలను వేశామని చెప్పారు. ఇరువైపుల వాదనలను విన్న ధర్మాసనం... ప్రతివాదులైన టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ సహా సిట్ కు కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

More Telugu News