Hyderabad traffic police: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తి.. పరిగెడుతూ అంబులెన్స్‌కు దారి చూపిన వైనం

Traffic Constable Clears Traffic for Ambulance video goes viral
  • ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన అంబులెన్స్
  • తాను ముందు పరిగెడుతూ ట్రాఫిక్ క్లియర్ చేసిన బాబ్జీ
  • నెటిజన్లు ఫిదా.. ప్రశంసల వర్షం
ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తి ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. ట్రాఫిక్‌లో చిక్కుకుని ముందుకు కదల్లేక పోతున్న అంబులెన్స్ అవస్థను గుర్తించి, తాను ముందు పరిగెడుతూ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ, అంబులెన్స్‌ సకాలంలో ఆసుపత్రికి చేరుకునేలా చేసి అందరి మన్ననలు అందుకున్నాడు. హైదరాబాద్ సిటీ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. ‘ప్రతి అడుగు ప్రజల కోసమే.. మీ భద్రతే మాకు ముఖ్యం’ అనే క్యాప్షన్ దానికి తగిలించారు. ఇప్పుడది వైరల్ అవుతోంది.

బాబ్జీ అనే వ్యక్తి అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మొజంజాహీ మార్కెట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కోఠి వెళ్లే మార్గంలో అంబులెన్స్ ఒకటి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన విషయాన్ని గమనించాడు. వెంటనే అప్రమత్తమై అంబులెన్స్ కోసం ట్రాఫిక్ క్లియర్ చేయాలని భావించాడు.

అంబులెన్స్ ముందు తాను పరిగెడుతూ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ముందుకు సాగాడు. వాహనదారులు కూడా ఆయనకు సహకరించడంతో అంబులెన్స్ సకాలంలో ఆసుపత్రికి చేరింది. ఫలితంగా అంబులెన్స్‌లో ఉన్న బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Hyderabad traffic police
Ambulance
Telangana
Constable

More Telugu News