Donald Trump: భారత రాజకీయ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోన్న ట్రంప్‌ జూనియర్ ట్వీట్‌

  • అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ కుమారుడు ట్వీట్
  • ప్రపంచ పటాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి పలు వ్యాఖ్యలు
  • రిపబ్లికన్‌ పార్టీ కలర్‌ ను చాలా దేశాల్లో చూపించిన ట్రంప్ జూనియర్ 
  • భారత్‌లోని కొన్ని భూభాగాల్లో మాత్రమే తమకు అనుకూలమని ట్వీట్ 
jr trump tweet viral

అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవరన్న విషయం మరి కొన్ని గంటల్లో తేలనుంది. అయితే, అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్ చేసిన ఓ ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. ఆయన చేసిన ట్వీట్‌పై భారత రాజకీయ నేతలూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ పటాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ట్రంప్ జూనియర్.. అన్ని దేశాలను రిపబ్లికన్‌ పార్టీ కలర్‌ ‘ఎరుపు రంగు’లో చూపించారు.

ఆయా దేశాలన్నీ ట్రంప్ విజయాన్ని సాధిస్తాడని విశ్వాసంతో ఉన్నాయని చెప్పారు. అయితే, ఇందులో భారత్, చైనా, లైబేరియా, మెక్సికో వంటి కొన్ని దేశాలను మాత్రం డెమోక్రట్‌ పార్టీ కలర్ ‘నీలి రంగు’‌లో చూపించారు. ఆ దేశాలు జో బైడెన్‌కు మద్దతుదారులని చెప్పుకొచ్చారు. అలాగే, తమ దేశంలోని కాలిఫోర్నియా, మేరీల్యాండ్‌ వంటి రాష్ట్రాలను సైతం ఆయన నీలి రంగులోనే చూపించారు. తన అంచనా ఇలా ఉందని చెప్పారు.

అయితే, ఆయన భారత్‌లోని జమ్మూకశ్మీర్‌, లడఖ్, ఈశాన్య రాష్ట్రాలను ఎరుపు రంగులో చూపించడం వివాదాస్పదమవుతోంది. భారత్‌లోని అన్ని ప్రాంతాలను నీలి రంగులో చూపి, కొన్ని ప్రాంతాలను మాత్రం ఎరుపు రంగులో చూపడం పట్ల పలువురు విమర్శలు చేశారు. ట్రంప్ భారత్‌కు స్నేహితుడని భావిస్తే, తనయుడు మాత్రం తన బుద్ధిని చూపించారంటూ బీజేపీయేతర పార్టీల నేతలు ట్వీట్లు చేస్తున్నారు.

ప్రెసిడెంట్ ట్రంప్‌తో మనకు ఎంతో స్నేహం ఉందని, అయితే, ట్రంప్ జూనియర్ మాత్రం భారత్‌ను‌ జో బైడెన్‌, కమల హారిస్‌ మద్దుతుదారుగా చూపించారని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి  ఒమర్ అబ్దుల్లా అన్నారు. అంతేగాక, ఆశ్చర్యంగా జమ్మూకశ్మీర్‌, ఈశాన్య ప్రాంతాలు మాత్రమే ట్రంప్‌కి ఓటు వేస్తాయని వెల్లడించారని అన్నారు. ఆయన వద్ద ఉన్న కలర్‌ పెన్సిల్‌ను ఎవరైనా లాక్కోవాలని సెటైర్ వేశారు.

నమో బ్రొమాన్స్‌కు దక్కిన బహుమతి ఇదంటూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు శశి థరూర్‌ అన్నారు. భారత్‌లోని జమ్మూకశ్మీర్‌, ఈశాన్య ప్రాంతాలను చైనా, మెక్సికో వంటి శత్రువులు, మురికి ప్రదేశాలతో కలిపారని మండిపడ్డారు. మరోపక్క, పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఈ మ్యాప్‌పై స్పందిస్తూ జమ్మూకశ్మీర్‌ని పాక్ ‌లో భాగంగా చూపించారని, చాలా ప్రోత్సాహకరంగా ఉందని అంటూ ట్వీట్ చేయడం గమనార్హం.

More Telugu News