'రాధే శ్యామ్' ఇటలీ షూటింగ్ పూర్తి.. తిరిగొచ్చిన యూనిట్!

04-11-2020 Wed 09:34
  • ఇటీవల ఇటలీ వెళ్లిన 'రాధే శ్యామ్' యూనిట్ 
  • పలు లొకేషన్లలో కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • సోమవారం ఇండియాకు తిరిగొచ్చిన యూనిట్
  • హైదరాబాదులో మరో ఇరవై రోజుల షూటింగ్
Radhe Shyam unit returned to India after completing shoot

'సాహో' సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'రాధే శ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ఇటీవల ఇటలీలోని పలు లొకేషన్లలో జరిగింది. హీరో హీరోయిన్లు ప్రభాస్, పూజ హెగ్డేలతో పాటు మరికొందరు నటీనటులు పాల్గొన్న పలు సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు.

ఇక అక్కడ షూటింగ్ పూర్తవడంతో సోమవారం నాడు యూనిట్ ఇండియాకు చేరుకుంది. ఓపక్క కరోనా మహమ్మారి వ్యాప్తి వున్నప్పటికీ, ఈ చిత్రం యూనిట్ చాలా ధైర్యం చేసి అక్కడ షూటింగ్ నిర్వహించింది. కథ ప్రకారం ఇటలీలోనే చేయాల్సిన సన్నివేశాలు కావడంతో ఆ రిస్క్ చేసి అక్కడ షూటింగ్ చేశారు.

ఇప్పుడు తదుపరి షెడ్యూలు షూటింగును హైదరాబాదులో పెద్దగా గ్యాప్ లేకుండానే ప్రారంభించనున్నారు. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్థూడియోలలో వివిధ రకాల సెట్స్ ను వేస్తున్నారు. ఇంక మరో ఇరవై రోజుల షూటింగ్ నిర్వహిస్తే షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ నటి, నిన్నటితరం కథానాయిక భాగ్యశ్రీ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తోంది.