Dubbaka: 'దుబ్బాక'లో 35 శాతం పోలింగ్... చేగుంటలో తమ్ముడి ఓటు వేసిన అన్న!

Polling in Dubbaka by election
  • నేడు దుబ్బాకలో ఉప ఎన్నిక పోలింగ్
  • ప్రశాంతంగా సాగుతున్న ఓటింగ్
  • చేగుంటలో దొంగ ఓటు కలకలం
  • ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు
సర్వత్రా ఆసక్తిని రేపిన దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడం, చేగుంటలో ఓ దొంగ ఓటు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో హోరాహోరీ నెలకొనడంతో కట్టుద్టిటమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం 11 గంటల సమయానికి నియోజకవర్గం వ్యాప్తంగా 34.33 శాతం ఓటింగ్ నమోదైంది. 12 గంటల సమయానికి 35 శాతం పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

కాగా, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, భౌతికదూరం పాటించేలా ఓటర్ల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పలు బూత్ లలో ఓటింగ్ తీరును పరిశీలించారు. అధికారులకు, భద్రతా సిబ్బందికి సూచనలు చేశారు.

ఇక, నియోజకవర్గంలోని చేగుంటలో దొంగ ఓటు కలకలం రేగింది. తమ్ముడి ఓటు అన్న వేసినట్టు తెలిసింది. తమ్ముడు ఓటు వేసేందుకు రావడంతో అసలు విషయం వెల్లడైంది. తన ఓటును పోలింగ్ ఏజెంట్ సాయంతోనే వేశారని తమ్ముడు ఆరోపించారు. ఈ నేపథ్యంలో టెండర్ ఓటు వేసేందుకు ప్రిసైడింగ్ అధికారి అనుమతించారు.

అటు, జిల్లా కలెక్టర్ భారతి హోళికెరి కూడా పలు బూత్ లతో పోలింగ్ సరళిని పరిశీలించారు. దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Dubbaka
By Election
Polling
Siddipet District
Telangana

More Telugu News