అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ పాతబస్తీ వాసి

Hyderabad man killed in america
  • పదేళ్లుగా జార్జియాలో ఉంటున్న మహ్మద్ ఆరిఫ్
  • ఇంటి వద్దే దాడిచేసి ఆపై కత్తితో పొడిచిన దుండగులు
  • అత్యవసర వీసాపై అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరిన భార్య
అమెరికాలోని జార్జియాలో గత పదేళ్లుగా నివసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఆరిఫ్ మొహియుద్దీన్ (37) గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. నగరంలోని పాతబస్తీ చంచల్‌గూడకు చెందిన ఆరిఫ్ జార్జియాలో కిరణా దుకాణం పెట్టుకుని జీవిస్తున్నాడు. ఆదివారం ఆయన ఇంటి వద్దకు వచ్చిన దుండగులు తొలుత దాడికి పాల్పడ్డారు. ఆపై కత్తితో విచక్షణ రహితంగా పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆరిఫ్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స  పొందుతూ మృతి చెందాడు.

అక్కడి పోలీసు అధికారుల ద్వారా సమాచారం అందుకున్న హైదరాబాద్‌లోని ఆయన భార్య మెహ్నాజ్ ఫాతిమా, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికాలో తమకెవరూ బంధువులు లేరని, అత్యవసర వీసాపై అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

 జార్జియా ఆసుపత్రిలో ఉన్న తన భర్త మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తన భర్తతో ఫోన్‌లో మాట్లాడానని, అరగంట తర్వాత మళ్లీ చేస్తానని చెప్పాడని, అంతలోనే ఘోరం జరిగిపోయిందని మెహ్నాజ్ కన్నీళ్లు పెట్టుకుంది. కాగా, మెహ్నాజ్‌ను అమెరికా పంపించాలని కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌, అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి తెలంగాణకు చెందిన మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఏంబీటీ) పార్టీ ప్రతినిధి ఉల్లా ఖాన్ లేఖలు రాశారు.
Go Back to Shorts
Hyderabad
Old city
America
killed

More Telugu News