ట్రంప్ ఎన్నికల ర్యాలీల కారణంగా 30 వేల మందికి కరోనా!

03-11-2020 Tue 09:16
  • జూన్ 20- సెప్టెంబరు 22 మధ్య ట్రంప్ 18 ర్యాలీలు
  • భారీ మూల్యం చెల్లించుకున్న ట్రంప్ అభిమానులు 
  • ర్యాలీల్లో పాల్గొన్న వారి కారణంగా 700 మంది మృతి
30 thousand people infected to corona since they attend trump rallies
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఏడాది జూన్ 20 నుంచి సెప్టెంబరు 22 మధ్య ట్రంప్ నిర్వహించిన 18 భారీ ర్యాలీల కారణంగా వేలాదిమంది కరోనా బారినపడ్డారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ట్రంప్ ర్యాలీలకు వచ్చిన ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలను గాలికి వదిలేశారు.

 ఫలితంగా ర్యాలీలు నిర్వహించిన ప్రాంతాల్లో సాధారణం కంటే 30 వేల కేసులు అధికంగా నమోదైనట్టు అధ్యయనకారులు గుర్తించారు. ర్యాలీ జరగడానికి ముందు, ఆ తర్వాత పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అధ్యయనకారులు.. ర్యాలీ తర్వాత పెద్దమొత్తంలో కేసులు నమోదైనట్టు గుర్తించారు. అలాగే, వైరస్ కారణంగా 700 మందికిపైగా మృతి చెందినట్టు తేల్చారు. అయితే, మృతులు ర్యాలీలో పాల్గొన్న వారు కాదని, అందులో పాల్గొన్న వారి ద్వారా వైరస్ సోకి మరణించిన వారని తెలిపారు. ట్రంప్‌పై అభిమానంతో ర్యాలీల్లో పాల్గొన్న ఆయన అభిమానులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని సర్వే పేర్కొంది.