APSRTC: ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ రూట్లు, బస్సుల వివరాలు!

  • విజయవాడ, కర్నూలు రూట్లలో అధిక టీఎస్ బస్సులు
  • శ్రీశైలం మీదుగా తెలంగాణలోకి లేని ఏపీ బస్సులు
  • ఒప్పందం ఆసాంతం తెలంగాణ అధికారుల ప్రతిపాదన ప్రకారమే
Telangana RTC Routes and Buses in AP

నిన్న తెలంగాణ, ఏపీఎస్ ఆర్టీసీల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఒప్పందం కుదిరిన తరువాత, ఆ వెంటనే బస్సులు సరిహద్దులు దాటేందుకు బయలుదేరాయి. ఈ ఒప్పందం ఆసాంతం తెలంగాణ అధికారుల ప్రతిపాదనల మేరే జరగడం గమనార్హం. ఇక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సులు అత్యధికంగా విజయవాడ, కర్నూలు రూట్లలో తిరగనున్నాయి.

విజయవాడ రూట్ లో మొత్తం 273 టీఎస్ఆర్టీసీ బస్సులు 52,944 కిలోమీటర్లు తిరగనున్నాయి. కర్నూలు రూట్ లో 213 బస్సులు 43,456 కిలోమీటర్లు తిరగనున్నాయి. పిడుగురాళ్ల - గుంటూరు రూట్ లో 67 బస్సులు 19,044 కిలోమీటర్లు, మాచర్ల రూట్ లో 66 బస్సులు 14,158 కిలోమీటర్లు తిరుగుతాయి.

ఇక నూజివీడు, తిరువూరు, భద్రాచలం రూట్ లో 48 బస్సులు 12,453 కిలోమీటర్లు, ఖమ్మం, జంగారెడ్డి గూడెం రూట్ లో 35 బస్సులు 9,140 కిలోమీటర్లు, శ్రీశైలం రూట్లో 62 బస్సులు 1,904 కిలోమీటర్లు, సత్తుపల్లి, ఏలూరు రూట్ లో 62 బస్సులు 8,159 కిలోమీటర్ల దూరం ఏపీలో ప్రయాణించనున్నాయని అధికారులు తెలిపారు.

కాగా, విజయవాడ, కర్నూలు, మాచర్ల, సత్తుపల్లి మార్గాల్లో ఏపీ బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గింది. శ్రీశైలం నుంచి తెలంగాణలోకి వచ్చేలా ఒక్క బస్సు కూడా నడవబోవడం లేదు. ఖమ్మం - జంగారెడ్డి గూడెం, నూజివీడు - భద్రాచలం రూట్ లో మాత్రం ఏపీ బస్సుల సంఖ్యే అధికం.

More Telugu News