Bihar: బీహార్‌లో ప్రారంభమైన రెండోవిడత పోలింగ్.. బరిలో హేమాహేమీలు

  • మూడు విడతలుగా బీహార్ ఎన్నికలు
  • రాఘోపూర్ నుంచి బరిలో ఉన్న మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ
  • దేశవ్యాప్తంగా 54 స్థానాలకు ఉప ఎన్నికలు
second phase polling starts in Bihar

మూడు విడతల ఎన్నికలకు గాను నేడు బీహార్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహాకూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నుంచి బరిలో నిలిచారు. ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ హసన్‌పుర నుంచి పోటీ చేస్తున్నారు.

అలాగే, ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేబినెట్‌లో‌ మంత్రులుగా ఉన్న బీజేపీ నేత నందకిశోర్ యాదవ్ పాట్నా సాహెబ్ నుంచి పోటీ చేస్తుండగా, జేడీయూ నేతలు శ్రవణ్ కుమార్ నలంద నుంచి, రామ్‌సేవక్ సింగ్ హతువా నుంచి, బీజేపీ నేత రాణా రణ్‌ధీర్ సింగ్ మధుబన్ నుంచి బరిలో నిలిచారు. ఈ స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది.

రాష్ట్రంలోని 243 స్థానాలకు గత నెల 28న తొలి విడత ఎన్నికలు జరిగాయి. మొత్తం 71 స్థానాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 1066 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మూడో విడత ఈ నెల 7న జరగనున్నాయి.  అలాగే, నేడు దేశవ్యాప్తంగా 54 స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వీటిలో అత్యధికంగా 28 స్థానాలు మధ్యప్రదేశ్‌లోనే ఉండడం గమనార్హం. అలాగే, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్, హర్యానా, ఝార్ఖండ్, కర్ణాటక, నాగాలాండ్, ఒడిశాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

More Telugu News