Mukesh Ambani: ఒక్క రోజులో రూ. 50 వేల కోట్లకు పైగా నష్టపోయిన ముఖేశ్ అంబానీ!

  • మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయిన రిలయన్స్ ఫలితాలు
  • 8.6 శాతం నష్టపోయిన ఈక్విటీ విలువ
  • ఇంధన డిమాండ్ పడిపోవడమే కారణం
Mukesh Ambani Assets Devlined by 7 billion Dollors

ఆసియాలోని అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ సంపద ఒక్క రోజులో 7 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 50 వేల కోట్లకు పైగా) నష్టపోయింది. సంస్థ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోవడంతో దాదాపు ఏడు నెలల తరువాత, రిలయన్స్ ఈక్విటీ భారీగా నష్టపోయింది. సంస్థ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు పోటీ పడ్డారు. సోమవారం నాడు భారత స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ ఈక్విటీ విలువ ఏకంగా 8.6 శాతం మేరకు పడిపోయింది. ఈ ప్రభావం సెన్సెక్స్ పైనా కనిపించింది. 

బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ముఖేశ్ ఆస్తుల విలువ 78 బిలియన్ డాలర్ల నుంచి 71 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. కాగా, శుక్రవారం రాత్రి తన రెండో త్రైమాసికం ఫలితాలను విడుదల చేసిన సంస్థ లాభం 15 శాతం తగ్గిందని ప్రకటించడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. కరోనా మహమ్మారి కారణంగా ఇంధన డిమాండ్ పడిపోయిందని, దీంతో ఆదాయం 24 శాతం తగ్గి రూ. 1.16 లక్షల కోట్లకు చేరగా, రూ. 9,570 కోట్ల లాభం వచ్చిందని సంస్థ తెలిపింది. 

రెండో త్రైమాసికంలో ప్రజలు ఎక్కువగా ఇంటికే పరిమితం కావడం, రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండి, ఇంధన అమ్మకాలు పడిపోవడం రిలయన్స్ లాభాలు తగ్గడానికి కారణమైంది. ఇదే మూడు నెలల వ్యవధిలో కేవలం ఇంధన రంగంపైనే కాకుండా, టెక్నికల్, డిజిటల్ సేవలకు సంస్థను విస్తరించాలన్న ఉద్దేశంతో ముఖేశ్ అంబానీ కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిన సంగతి తెలిసిందే.

More Telugu News