Kadapa District: కడప రోడ్డు ప్రమాదంలో వెలుగులోకి కొత్త కోణం.. హైజాక్ గ్యాంగ్ వెంటాడడం వల్లే ప్రమాదం

  • కడప జిల్లా అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా
  • హైజాకర్లను చూసి స్పీడు పెంచిన స్మగ్లర్లు
  • ఒకదాని తర్వాత ఒకటిగా టిప్పర్‌ను ఢీకొట్టిన స్మగ్లర్, హైజాకర్ల వాహనాలు
new angle in kadapa red sandal smugglers vehicle accident

కడప జిల్లా  వల్లూరు మండలం గోటూరు వద్ద నిన్న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు సజీవ దహనమైన ఘటనలో కొత్త కోణం ఒకటి తాజాగా వెలుగుచూసింది. మృతి చెందిన ఐదుగురూ తమిళనాడుకు చెందినవారే. గాయపడిన మరో ముగ్గురు ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. నిజానికి ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో దానిని రాసుకుంటూ టిప్పర్‌ను ఢీకొట్టడం వల్ల మంటలు చెలరేగి స్కార్పియో వాహనంలో ఉన్న నలుగురూ సజీవ దహనమైనట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, అది నిజం కాదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

కడప జిల్లాకు చెందిన హైజాక్ గ్యాంగ్ తమిళనాడు స్మగ్లర్లను వెంటాడడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్మగ్లర్లు ఎర్ర చందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు తెలిసిన హైజాక్ గ్యాంగ్ తెల్లవారుజామున 3-4 గంటల మధ్య స్కార్పియోను వెంబడించారు. గమనించిన స్మగ్లర్లు మరింత వేగం పెంచారు.

ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను తొలుత స్మగ్లర్ల వాహనం ఢీకొట్టింది. ఆ వెంటనే హైజాకర్ల కారు కూడా ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. స్కార్పియో వాహనంలో ఎర్ర చందనం దుంగలతోపాటు 8 మంది స్మగ్లర్లు కూడా ఉన్నారు. వీరిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. కడప జిల్లా అడవుల్లో వీరు ఎర్ర చందనం చెట్లను నరికి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

More Telugu News