AI Camera: ఫుట్ బాల్ కు, బట్టతలకు తేడా కనుక్కోలేకపోయిన ఏఐ పరిజ్ఞానం!

AI Cam mistakenly recognized linesman bald head as foot ball
  • స్కాట్లాండ్ ఫుట్ బాల్ మ్యాచ్ లో విచిత్ర పరిస్థితి
  • బంతిని వదిలేసి లైన్స్ మన్ బట్టతల వైపు ఫోకస్ చేసిన ఏఐ కెమెరా
  • మ్యాచ్ ఆద్యంతం ఇదే తంతు!
యూరప్ దేశాల్లో నిత్యం ఫుట్ బాల్ పోటీలు జరుగుతుంటాయి. క్లబ్ సంస్కృతి ఎక్కువగా ఉండే ఆ దేశాల్లో ఫుట్ బాల్ అంటే ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే మ్యాచ్ ప్రసారాల కోసం బ్రాడ్ కాస్టర్లు అత్యాధునిక టెక్నాలజీ వాడుతుంటారు. ఇటీవల వచ్చిన ఏఐ (కృత్రిమ మేధ) పరిజ్ఞానాన్ని కూడా ఇప్పుడు మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ కోసం వినియోగిస్తున్నారు. ఈ ఏఐ కెమెరాలు నిర్దేశిత ప్రోగ్రామ్ కు అనుగుణంగా మ్యాచ్ ను తమంతట తామే కవర్ చేస్తాయి. బంతి ఎటు వెళితే అటు తమ యాంగిల్స్ సరిచేసుకుంటాయి.

అయితే ఇటీవల స్కాట్లాండ్ లో జరిగిన ఫుట్ బాల్ పోటీలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గ్యాలరీ పైభాగంలో అమర్చిన ఓ ఏఐ కెమెరా ఫుట్ బాల్ కు, లైన్స్ మన్ బట్టతలకు తేడా కనుక్కోలేక తికమకపడిపోయింది. దాంతో మ్యాచ్ లో బంతిని చూపించడానికి బదులు అత్యధిక భాగం ఆ లైన్స్ మన్ ఎటు కదిలితే ఈ కెమెరా అటే తన దృష్టి సారించింది.

బంతి కోసం ఇరుజట్లు హోరాహోరీగా పోరాడుతుంటే... అదంతా వదిలేసి లైన్స్ మన్ వెంట పడింది. అతగాడు ఎటు పరుగులు తీస్తే అటు తన లెన్స్ ను ఫోకస్ చేస్తూ గందరగోళం సృష్టించింది. చివరికి టెక్నీషియన్ల విశ్లేషణలో తేలింది ఏంటంటే... ఆ ఏఐ కెమెరా లైన్స్ మన్ బట్టతలను ఫుట్ బాల్ గా పొరబడిందట. నున్నగా గుండ్రంగా ఉండేసరికి అదే బంతి అనుకుని అటువైపే కవర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
AI Camera
Foot Ball
Bald Head
Linesman
Scotland

More Telugu News