Visakhapatnam: బాకీ వసూలు కోసం రెండేళ్ల బాలుడి కిడ్నాప్.. 12 గంటల్లోనే కిడ్నాపర్ల ఆటకట్టు

  • తనకు రావాల్సిన రూ. 43 లక్షలు వసూలు చేసేందుకు వ్యాపారి ప్లాన్
  • అద్దె కారులో బాలుడి ఇంటికి వచ్చి కిడ్నాప్
  • 12 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
business man kidnapped 2 year old boy for money

తనకు బాకీ పడిన రూ. 43 లక్షలను వసూలు చేసేందుకు ఓ ఐరన్ వ్యాపారి రెండేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశాడు. విశాఖపట్టణంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గాజువాక ఆటోనగర్‌లోని సెయిల్ స్టాక్‌యార్డులో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న నరేశ్ కుమార్ యాదవ్, మరోవైపు ఐరన్ వ్యాపారం కూడా చేస్తుంటాడు. డాబాగార్డెన్స్ ప్రాంతానికి చెందిన ఐరన్ వ్యాపారి ప్రజిత్ కుమార్ బిశ్వాల్ నుంచి ఇటీవల పెద్ద మొత్తంలో ఐరన్ కొనుగోలు చేశాడు. ఇందుకు గాను ఇంకా రూ. 43 లక్షలు చెల్లించాల్సి ఉంది.

అయితే, తనకు ఇవ్వాల్సిన సొమ్మును ఇవ్వకుండా నరేశ్ వాయిదాలు వేస్తుండడంతో విసిగిపోయిన ప్రజిత్ కుమార్ బాకీ సొమ్మును ఎలాగైనా రాబట్టుకోవాలని పథకం రచించాడు. ఇందులో భాగంగా నరేశ్ రెండేళ్ల కుమారుడు మయాంక్‌ను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా శనివారం మధ్యాహ్నం అద్దె కారులో భార్య చిన్నురాణితో కలిసి నరేశ్ ఇంటికి వెళ్లిన ప్రజిత్ తాను మాత్రం కారులోనే ఉండి భార్యను లోపలికి పంపాడు.

ఈ క్రమంలో బయట ఆడుకుంటున్న మయాంక్‌ను కారులో ఎక్కించుకుని పరారయ్యాడు. అనంతరం నరేశ్‌కు ఫోన్ చేసి తనకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చి మయాంక్‌ను తీసుకెళ్లాలని చెప్పాడు. దీంతో కంగారుపడిన నరేశ్ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నంబరు ఆధారంగా అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడు ప్రజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 12 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

More Telugu News