Donald Trump: మళ్లీ నేనే గెలిచి అధ్యక్షుడిని అవుతా: ఎల్లుండి జరిగే ఎన్నికలపై ట్రంప్‌

  • 2016 ఎన్నికల కంటే ఈ సారి భారీ మెజార్టీ వస్తుంది
  • మా ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది
  • బైడెన్ గెలిస్తే పన్నులు విపరీతంగా పెరిగిపోతాయి
  • దేశవ్యాప్తంగా నాకే మద్దతు వస్తోంది
trump  slams biden

అమెరికాలో ఎల్లుండి అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పకుండా తానే మళ్లీ విజయం సాధించి మళ్లీ అధ్యక్షుడిని అవుతానని చెప్పారు. 2016లో జరిగిన ఎన్నికల కంటే ఈ సారి భారీ మెజార్టీ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలిచిన జో బైడెన్‌ అవినీతిపరుడని ఆరోపించారు. ఆయన‌ గెలిస్తే అమెరికాలో సామ్యవాదం రాజ్యమేలుతుందని తెలిపారు. అలాగే, దేశంలో పన్నులు విపరీతంగా పెరిగిపోతాయని హెచ్చరించారు.

అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో తనకు దేశవ్యాప్తంగా మద్దతు వస్తోందని, దీంతో డెమోక్రటిక్ నేతలు ఏమీ చేయలేకపోతున్నారని చెప్పారు. ప్రజలు నవంబరు 3న అమెరికా కలని సాకారం చేయబోతున్నారని పెన్సిల్వేనియా ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన పాలనలో అమెరికాను సైనికపరంగా, రక్షణపరంగా మరింత బలోపేతం చేశామని చెప్పారు.

తన ప్రభ్యర్థి బైడెన్‌ ప్రణాళికలు మాత్రం దేశాన్ని నాశనం చేస్తాయని అన్నారు. తన విధానాలు మాత్రం దేశాన్ని మళ్లీ గొప్ప దేశంగా నిలబెడతాయని చెప్పుకొచ్చారు. కాగా, వేరే చోట నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

గత నాలుగేళ్లలో అన్ని రంగాల్లో తమ దేశాన్ని ట్రంప్‌ ఓడించారని ఆయన చెప్పారు. అమెరికాను విభజించి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన చెప్పారు. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్  దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేతిలో డొనాల్డ్ ట్రంప్‌ కీలుబొమ్మలా మారారని బైడెన్ అన్నారు.

More Telugu News