బెంగాల్ లో బీజేపీ నేతను చంపిన షార్ప్ షూటర్లు ఇలా దొరికిపోయారు!

31-10-2020 Sat 22:00
  • బెంగాల్ లో బీజేపీ నేత మనీశ్ శుక్లా హత్య
  • హత్య తర్వాత పంజాబ్ పారిపోయిన దుండగులు
  • ఓ దోపిడీకి పాల్పడి పారిపోతుండగా పట్టుబడ్డ వైనం
Police chased down two sharp shooters

పశ్చిమ బెంగాల్ లోని టిటాగఢ్ లో అక్టోబరు 4న మనీశ్ శుక్లా అనే బీజేపీ నేత హత్యకు గురయ్యారు. ఓ పోలీస్ స్టేషన్ వద్ద స్థానిక కార్యకర్తలతో మాట్లాడుతుండగా దుండగులు కాల్చి చంపారు. చివరికి నిందితులు పంజాబ్ లో దొరికిపోయారు. అది కూడా ఎంతో నాటకీయంగా పట్టుబడ్డారు. మనీశ్ శుక్లాను చంపిన తర్వాత దుండగులు పంజాబ్ పారిపోయారు.

అయితే, ఇటీవలే వారు లూథియానాలో ఓ దోపిడీకి పాల్పడి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని చుట్టుముట్టగా... ఓ బైక్ పై ముగ్గురు దుండగులు ఒక్కసారిగా దూసుకెళ్లేందుకు యత్నించారు. కానీ, ఒక్కసారిగా బైక్ స్పీడ్ పెంచడంతో వెనుక కూర్చున్న ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. దాంతో పోలీసులు స్థానికుల సాయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

వారిని విచారించగా, మనీశ్ శుక్లా హత్య విషయం వెల్లడైంది. దాంతో ఆ హత్యలో పాలుపంచుకున్న షార్ప్ షూటర్లు వారే అయ్యుంటారని ఓ అంచనాకు వచ్చారు. కాగా, ఆ ఇద్దరు నేరస్తులను పోలీసులు, స్థానికులు పట్టుకునే వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.