గ్రేటర్ లో వరద సాయాన్ని గులాబీ గద్దలు స్వాహా చేశాయి: రేవంత్ రెడ్డి

31-10-2020 Sat 19:26
  • వరదలతో హైదరాబాదు వాసులు అతలాకుతలం
  • వరద సాయం ప్రకటించిన సర్కారు
  • తమకు సాయం అందలేదంటూ కొన్నిప్రాంతాల్లో ఆందోళనలు
Revanth Reddy slams TRS party leaders over flood relief distribution

హైదరాబాదులో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. వరద బాధితులకు టీఆర్ఎస్ సర్కారు ఆర్థికసాయం ప్రకటించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో తమకు సాయం అందలేదంటూ వరద బాధితులు రోడ్డెక్కారు. ఉప్పల్, యాప్రాల్ తదితర ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టారు. నాచారం-మల్లాపూర్ రహదారిపైనా నిరసనలు తెలిపారు. అధికార పక్షానికి చెందినవాళ్లకే డబ్బులు ఇస్తున్నారని, నిజంగా నష్టపోయిన వాళ్లకు ఆర్థికసాయం అందడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దీనిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. గ్రేటర్ హైదరాబాదులో వరద సాయాన్ని గులాబీ గద్దలు స్వాహా చేశాయని విమర్శించారు. వరద బాధితుల సాయంలోనూ కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. గ్రేటర్ లో ఓట్లు రాబట్టుకోవాలన్న దుర్బుద్ధే ఈ కుంభకోణానికి కారణం అని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేసేవారని, ఇప్పుడు పరిహారం నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.