మరో ఆఫర్ ప్రకటించిన హైదరాబాద్ మెట్రో రైల్

31-10-2020 Sat 18:23
  • స్మార్ట్ కార్డు రీఛార్జ్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిన మెట్రో
  • రూ. 600 వరకు క్యాష్ బ్యాక్
  • స్మార్ట్ కార్డులోనే జమకానున్న క్యాష్ బ్యాక్
Hyderabad Metro Rail offers cashback offer

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో మరో ఆఫర్ ప్రకటించింది. మెట్రో స్మార్ట్ రీఛార్జ్ పై 50 శాతం వరకు అంటే రూ. 600 వరకు క్యాష్ బ్యాక్ ఇచ్చే ఆఫర్ ను అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. ఆన్ లైన్లో, మెట్రో స్టేషన్లలో రీఛార్జ్ చేసుకునేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పింది. ప్రయాణికులకు లభించే క్యాష్ బ్యాక్... వారి స్మార్ట్ కార్డులోనే జమ అవుతుందని తెలిపింది. అయితే రీఛార్జ్ చేసుకున్న మొత్తాన్ని 90 రోజుల్లోగా వినియోగించుకోవాల్సి ఉంటుందని చెప్పింది.

ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ, మెట్రో రైల్ లో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ప్రయాణికులు ఆసక్తి  చూపిస్తున్నారని అన్నారు. సిటీలో ఉన్న మూడు కారిడార్లలో సగటున రోజుకు 1.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఇటీవల సువర్ణ ప్యాకేజ్ లో భాగంగా 40 శాతం రాయితీ ప్రకటించామని.. ఆ ఆఫర్ తర్వాత ప్రయాణికుల సంఖ్య 30 శాతం పెరిగిందని చెప్పారు.