రాజమౌళి సినిమా కోసం అలియా భట్ పాట!

31-10-2020 Sat 17:08
  • తన చిత్రాలలో పాటలు పాడే అలియా 
  • 'ఆర్ఆర్ఆర్'లో చరణ్ సరసన సీత పాత్ర
  • హిందీ వెర్షన్ కి పాడించనున్న రాజమౌళి
  • వచ్చే నెల నుంచి షూటింగులో అలియా
Alia Bhat sings for Rajamoulis RRR

బాలీవుడ్ భామ అలియా భట్ కు ఓ ప్రత్యేకత వుంది. ఆమె మంచి నటే కాకుండా మంచి గాయనిగా కూడా పేరుతెచ్చుకుంది. అప్పుడప్పుడు తన సినిమాలలో తన గాత్రాన్ని మనకు వినిపిస్తూ వస్తోంది. ఆమధ్య తాను నటించిన 'హైవే', 'హంప్టీ శర్మ కీ దుల్హనియా' వంటి హిందీ చిత్రాలలో అలియా పాడిన పాటలకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ క్రమంలో ఈ చిన్నది తాజాగా మరోసారి తన గానాన్ని మనకు వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తాను రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తోంది. ఇందులో చరణ్, అలియాలపై చిత్రీకరించే ఓ పాటను ఆమె చేతే పాడించడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. అయితే, తెలుగు వెర్షన్ కి కాకుండా, హిందీ వెర్షన్ కి మాత్రమే ఆమె పాట పాడుతుందనీ, తెలుగు వెర్షన్ కి మరో గాయనితో పాడిస్తారని అంటున్నారు.

ఇదిలావుంచితే, ఈ 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగులో అలియా ఇంతవరకు పాల్గొనలేదు. నవంబర్ మొదటి వారం నుంచి జరిగే షూటింగులో ఈ ముద్దుగుమ్మ పాల్గొంటుందని తెలుస్తోంది. అందుకోసం ఆమె బల్క్ డేట్స్ ఇచ్చిందట. ఈ చిత్రం షూటింగ్ కోసం ఆమె నెల రోజుల పాటు హైదరాబాదులోనే ఉంటుందని సమాచారం.