Andhra Pradesh: పీఏసీ ర్యాంకులు... సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రాల్లో మూడో స్థానాన్ని నిలుపుకున్న ఏపీ

  • ర్యాంకుల జాబితా విడుదల చేసిన పీఏసీ
  • అగ్రస్థానంలో కేరళ
  • చిన్న రాష్ట్రాల్లో గోవా టాప్
  • కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ మిన్న
AP retains third place in PAC list of best governed states

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి జాతీయస్థాయిలో తన స్థానం పదిలపరుచుకుంది. ప్రజలకు ఉత్తమ పాలన అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ మూడోస్థానాన్ని నిలుపుకుంది. పబ్లిక్ అఫైర్స్ సెంటర్ (పీఏసీ) ఈ మేరకు పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్-2020 జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీకి 0.531 పాయింట్లు లభించాయి. ఇక, సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో కేరళ అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు ఆ తర్వాత స్థానంలో నిలిచింది.

సమానత్వం, అభివృద్ధి, స్థిరత్వం మూడు అంశాల ప్రాతిపదికన ఈ జాబితా రూపొందించారు. ఈ జాబితాను రెండు కేటగిరీలుగా విభజించారు. అధిక జనాభాతో కూడిన పెద్ద రాష్ట్రాలతో ఒక జాబితా, చిన్న రాష్ట్రాలతో మరో జాబితా విడుదల చేశారు. పెద్ద రాష్ట్రాల జాబితాలో కేరళ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక టాప్-4లో నిలిచాయి. యూపీ, ఒడిశా, బీహార్ పట్టికలో అట్టడుగున ఉన్నాయి.

చిన్న రాష్ట్రాల జాబితాలో గోవా అగ్రస్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో మేఘాలయా, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం ఉన్నాయి. ఇక, మణిపూర్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ లకు హీన ప్రదర్శన కారణంగా నెగెటివ్ పాయింట్లు వచ్చాయి.

కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా పీఏసీ జాబితా రూపొందించింది. అన్నింట్లోకి చండీగఢ్ మెరుగైన పాలనతో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాత స్థానాల్లో పుదుచ్చేరి, లక్ష్యద్వీప్, దాదర్ అండ్ నగర్ హవేలీ, అండమాన్, జమ్మూ కశ్మీర్, నికోబార్ ఉన్నాయి.

More Telugu News