Ashwini Choubey: పదో తరగతి కూడా చదవలేదు.. 'కేబినెట్' అనే పదానికి స్పెల్లింగ్ కూడా సరిగా రాయలేడు: కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే

Tejashwi Yadav Cant Even Spell Cabinet Says Ashwini Choubey
  • బీహార్ ను వేడెక్కిస్తున్న ఎన్నికల ప్రచారం
  • తేజశ్వికి ఏమాత్రం అవగాహన లేదన్న అశ్వినీ చౌబే
  • గప్పు-పప్పు కూటమిపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక 
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మహాఘటబంధన్ సీఎం అభ్యర్థి తేజశ్వి యాదవ్ పై కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తేజశ్వికి 'కేబినెట్' అనే పదం పలకడం కూడా సరిగా రాదని ఎద్దేవా చేశారు. 10వ తరగతి కూడా చదవని తేజశ్వి యాదవ్ ఇంజినీరింగ్ చదివిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఏ సమస్య గురించి కూడా తేజశ్వికి అవగాహన లేదని విమర్శించారు. కేబినెట్ అనే పదం స్పెల్లింగ్ కూడా తేజశ్వి రాయలేరని ఎద్దేవా చేశారు.

తేజశ్వి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ తన తొలి కేబినెట్ సమావేశంలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని నిర్ణయించారని... జనాల దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేశారని... అయితే, ఆ అప్లికేషన్లన్నీ ఇప్పటికీ డస్ట్ బిన్ లోనే ఉన్నాయని అశ్వినీ చౌబే విమర్శించారు. అంతేకాదు... జేడీయూ, కాంగ్రెస్ కూటమిని 'గప్పు - పప్పు' అని ఎద్దేవా చేశారు. ఈ గప్పు-పప్పు కూటమి జనాలకు 'లప్పు' ఇస్తుందని... అంటే నెరవేర్చలేని తప్పుడు హామీలను ఇస్తుందని, జనాలంతా వీరిపట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

బీహార్ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామనే హామీపై ఆయన స్పందిస్తూ... కేంద్ర ప్రభుత్వం 'ఆయుష్మాన్ భారత్' కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రస్తుతం మూడో దశలో ఉన్నాయని... అంతా సవ్యంగా జరిగితే వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వసతులను కల్పించినప్పుడే దాన్ని మంచి పాలన అంటారని... లేకపోతే దోపిడీ ప్రభుత్వం అంటారని చెప్పారు.
Ashwini Choubey
BJP
Tejashwi Yadav
RJD

More Telugu News