కొత్త దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్!

31-10-2020 Sat 15:34
  • ఇటీవలే 'శ్రీకారం' పూర్తి చేసిన శర్వా 
  • సెట్స్ పై 'ఆడాళ్లూ మీకు జోహార్లు'
  • తెలుగు, తమిళ భాషల్లో 'మహాసముద్రం' 
  • నూతన దర్శకుడు శ్రీరామ్ కథకి ఓకే  
Sharwanand gives nod to new director

మన యంగ్ హీరోల్లో శర్వానంద్ కి ఓ ప్రత్యేకత వుంది. మొదటి నుంచీ కూడా కథల ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తాడు. తన పాత్ర డిఫరెంట్ గా ఉంటేనే ఒప్పుకుంటాడు. ఆ క్రమంలో మెల్లగా సినిమాలు చేసుకుంటూ వెళతాడు. గత కొంత కాలంగా చేస్తున్న 'శ్రీకారం' చిత్రాన్ని ఇటీవలే చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

దీంతో తన తదుపరి చిత్రాలపై శర్వా దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు చిత్రాలు అంగీకరించాడు. వీటిలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందే 'మహాసముద్రం' ఒకటి కాగా, 'ఆడాళ్లూ మీకు జోహార్లు' సినిమా మరొకటి. వీటిలో 'ఆడాళ్లూ మీకు జోహార్లు' చిత్రం షూటింగ్ ఈమధ్యే తిరుపతిలో మొదలైంది.

మరోపక్క, ఇదే సమయంలో శర్వా తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. శ్రీరామ్ అనే నూతన దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. శ్రీరామ్ గతంలో దర్శకుడు దేవా కట్టా వద్ద పనిచేశాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుందని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.