షబ్బీర్ అలీ తన పొలంలో వరిని తానే తగలబెట్టించుకున్నారు: సీఎం కేసీఆర్

31-10-2020 Sat 15:13
  • జనగామ జిల్లాలో రైతు వేదిక ప్రారంభించిన సీఎం కేసీఆర్
  • గెలిచేది లేదు పీకేది లేదంటూ ప్రత్యర్థులపై వ్యాఖ్యలు
  • దుబ్బాకలో మనదే హవా అంటూ ధీమా
CM KCR inaugurates Rythu Vedika in Janagama district

తెలంగాణ సర్కారు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే క్రమంలో రైతు వేదికలను తీసుకువస్తోంది. జనగామ జిల్లా కొడకండ్లలో సీఎం కేసీఆర్ రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై ధ్వజమెత్తారు. కిరికిరిగాళ్లు ఉంటారని, రెండు ముచ్చట్లు చెబితే అలాంటివాళ్ల గురించి అర్థమవుతుందని అన్నారు.

"షబ్బీర్ అలీ అని ఒక మాజీ మంత్రి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన దేశనాయకుడో, రాష్ట్ర నాయకుడో తెలియదు కానీ సొంత వ్యవసాయ క్షేత్రంలో వరి పండించాడు. తన వరిని తానే కాల్పించి దొంగనాటకం ఆడాడు. గణేశ్ అనే ఎలక్ట్రీషియన్ ఆ వరిని తగులబెట్టాడు.

 ఇంత దొంగ ముచ్చటా? సొంతపొలంలోనే గడ్డి తగలబెట్టించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. తెలియని వాళ్లు నిజమే అని నమ్మరా? వీళ్లా రైతులకు మార్గదర్శనం చేసేది. అంతా ఓట్ల కోసమే. ఏంచేసైనా ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు. దుబ్బాకలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీళ్లక్కడ గెలిచేది లేది పీకేది లేదు. అక్కడ మనదే హవా. మరో నాలుగు రోజుల్లో మీరే చూస్తారు" అంటూ వ్యాఖ్యలు చేశారు.