క్రిస్ గేల్‌కు జరిమానా విధించిన ఐపీఎల్ యాజమాన్యం

31-10-2020 Sat 12:45
  • రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగిన గేల్
  • 99 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయిన వైనం
  • ఆగ్రహం తట్టుకోలేక బ్యాట్ ను విసిరికొట్టిన స్టార్ బ్యాట్స్ మెన్
IPL Management fines Chris Gayle

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడంటూ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఆటగాడు క్రిస్ గేల్స్ కు ఐపీఎల్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. మ్యాచ్ ఫీజులో 10 శాతాన్ని కట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే, రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా క్రిస్ గేల్ చెలరేగి పోయాడు. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 185 పరుగులు చేయగా... ఇందులో క్రిస్ గేల్ ఒక్కడే 99 పరుగులు చేశాడు.

భారీ సిక్సర్లతో విరుచుకుపడిన గేల్... చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ వేసిన మూడో బంతిని సిక్సర్ గా మలిచి 99 పరుగులకు చేరాడు. ఆ తర్వాతి బంతికి గేల్ ను ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆగ్రహాన్ని తట్టుకోలేక బ్యాట్ ను విసిరికొట్టాడు. ఆ తర్వాత ఆర్చర్ ను మెచ్చుకుంటూ పెవిలియన్ కు చేరుకున్నాడు. అయితే, ఐపీఎల్ నిబంధనల మేరకు బ్యాట్ ను విసిరికొట్టడం రూల్స్ కు విరుద్ధం. దీంతో, గేల్ కు ఐపీఎల్ యాజమాన్యం మ్యాచ్ ఫీజులో కోత విధించింది.