ఆసక్తికర ఘటన.. ఒకే విమానంలో ప్రయాణించిన తమిళనాడు సీఎం పళనిస్వామి, ప్రతిపక్ష నేత స్టాలిన్!

31-10-2020 Sat 12:23
  • పరస్పరం పలకరించుకోని నేతలు
  • ముత్తురామలింగ దేవర్‌ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రయాణం
  • ఎడమ వైపు కిటికీ పక్కన పళనిస్వామి
  • కుడి వైపు కిటికీ పక్కన స్టాలిన్‌
palani swamy stalin journey on same plane

తమిళనాడు రాజకీయాల్లో పరస్పర విమర్శలు చేసుకునే సీఎం పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఒకే విమానంలో ప్రయాణించాల్సి రావడం ఆసక్తిరేపింది. అయితే, ఒకే విమానంలో కూర్చుని వారిద్దరు ప్రయాణం చేసినప్పటికీ మాట్లాడుకోలేదు. రామనాథపురంలో జరిగిన ముత్తురామలింగ దేవర్‌ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వారిద్దరు ఒకే విమానంలో వెళ్లారు.

విమానంలోని ముందు వరుసలో ఎడమ వైపు కిటికీ పక్కన పళనిస్వామి కూర్చుకున్నారు. అలాగే, కుడి వైపు కిటికీ పక్కన స్టాలిన్‌ కూర్చుని ప్రయాణించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ విమానంలో ప్రయాణికులందరూ తప్పకుండా ముఖానికి షీల్డ్‌ ధరించేలా అధికారులు చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. వాటితో పాటు మాస్కులు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖానికి అవి ఉండడంతో వారిద్దరు ఒకరినొకరు పలకరించుకోలేదని  తెలుస్తోంది. వారిద్దరితో పాటు వారి పార్టీల నేతలు కూడా ఉన్నారు.