ఆకాశంలో నేడు మరో అద్భుతం.. ‘బ్లూమూన్’గా దర్శనమివ్వనున్న చందమామ

31-10-2020 Sat 10:21
  • మరింత పెద్దగా కనిపించనున్న జాబిలమ్మ
  • రాత్రి గం. 8.15 తర్వాత చంద్రుడిలో ప్రకాశం
  • ఇప్పుడు మిస్సయితే మళ్లీ 19 ఏళ్లు ఆగాల్సిందే
Rare Halloween Blue Moon to Appear on October 31 After 19 Years

ఆకాశంలో నేడు చందమామ కనువిందు చేయనున్నాడు. సాధారణం కంటే పెద్దగా, మరింత ప్రకాశవంతంగా దర్శనమివ్వనున్నాడు. చంద్రుడు ఇలా కనిపించడాన్ని ‘బ్లూమూన్’గా వ్యవహరిస్తారు. బ్లూమూన్ పేరు వెనక ఆసక్తికర విషయం దాగి ఉంది. 1883లో ఇండోనేషియాలోని క్రాకాటోవా అగ్ని పర్వతం పేలడంతో దాని బూడిద పెద్ద ఎత్తున ఆకాశానికి ఎగిసింది. ఈ బూడిద కారణంగా మేఘాలలోని కణాల రంగుమారడంతో చంద్రుడు నీలం రంగులో దర్శనమిచ్చాడు. దీనిని అరుదైన ఘటనగా పేర్కొన్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆనాటి చంద్రుడిని ‘బ్లూ మూన్’గా వ్యవహరించింది.

మరో కథనం ఏమిటంటే.. పౌర్ణమి ఏర్పడడానికి 29.5 రోజులు పడుతుంది. అంటే సంవత్సరానికి 12 పున్నములు ఏర్పడడానికి 354 రోజులు పడుతుంది. ఫలితంగా అవిపోను ఏడాదిలో మిగిలిన రోజులను రెండున్నరేళ్లకు ఒకసారి కలుపుతారు. అలా కలిపిన రోజుల కారణంగా ఓ ఏడాది 13 పున్నములు వస్తాయి. అదనంగా వచ్చే ఆ పౌర్ణమిని ‘బ్లూ మూన్’గా వ్యవహరించడం పరిపాటి.

అయితే, బ్లూ మూన్ అనగానే నీలంగా కనిపిస్తాడని కాదు కానీ.. ఆరోజున పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. నేటి రాత్రి గం. 8.15 తర్వాత చంద్రుడు పూర్తి ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అలాగే చంద్రుడి పక్కనే మార్స్ కూడా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. కాబట్టి.. డోంట్ మిస్. ఈ అందమైన దృశ్యాన్ని తప్పక తిలకించండి. ఎందుకంటే 2001 తర్వాత సరిగ్గా 19 ఏళ్లకు ఈ అరుదైన దృశ్యం కనిపిస్తోంది. మిస్సైతే మళ్లీ మూడేళ్లు ఆగాల్సి వస్తుంది. అయితే, ఇలాంటి హాలోవీన్ మూన్‌ను చూడాలంటే మాత్రం మళ్లీ 19 ఏళ్లు ఆగాల్సిందే!