నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: శిల్పా రవికి అఖిలప్రియ సవాల్‌

30-10-2020 Fri 18:35
  • ఇటీవల హత్యకు గురైన సుబ్బారాయుడు
  • హత్యతో భూమా కుటుంబానికి సంబంధం ఉందన్న ఎమ్మెల్యే శిల్పా రవి
  • నోరు అదుపులో పెట్టుకోవాలన్న అఖిలప్రియ
Bhuma Akhilapriya  challenges Shilpa Ravi

కొన్ని రోజుల క్రితం కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ నేత సుబ్బారాయుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఉదయం పూట వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆయనను కర్రలతో కొట్టి హత్య చేశారు. నంద్యాలలోని విజయ పాల డెయిరీ వద్ద ఈ దారుణం జరిగింది. అనంతరం ఈ హత్య రాజకీయ రంగును పులుముకుంది. ఈ హత్యతో భూమా కుటుంబానికి సంబంధం ఉందని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి ఆరోపించారు. ఈ ఆరోపణలపై మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు.

హత్యతో తమ కుటుంబానికి సంబంధం ఉందనే ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని శిల్పా రవికి సవాల్ విసిరారు. ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు. తమపై తప్పుడు కేసులు పెడితే విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నంద్యాల నియోజకవర్గంలో ఏది జరిగినా భూమా కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శిల్పా రవి పుట్టక ముందే భూమా నాగిరెడ్డి రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. తన తండ్రి మీద కూడా కేసులు పెట్టి హింసించారని దుయ్యబట్టారు. శిల్పా రవి నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు.