కేసీఆర్, కేటీఆర్ అద్భుతమైన విధానాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు: విజయ్ దేవరకొండ

30-10-2020 Fri 16:35
  • ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ విడుదల కార్యక్రమం  
  • పాల్గొన్న మంత్రి కేటీఆర్, హీరో విజయ్ దేవరకొండ 
  • వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ సంస్థలో విజయ్ భాగస్వామ్యం  
Vijay Devarakonda attends Telangana Government EV Policy release event

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విద్యుత్ ఆధారిత వాహనాల పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీ విడుదల కార్యక్రమం ఇవాళ హైదరాబాదులో జరిగింది. మంత్రి కేటీఆర్, ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని తెలిపారు. వచ్చే జనవరి నాటికి విద్యుత్ ఆధారిత వాహనాలు అందుబాటులోకి వస్తాయని, హైదరాబాద్ ప్రజల జీవన విధానం మారబోతోందని అన్నారు.

ఇక, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల అద్భుత విధానాల వల్ల తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు. వీరిద్దరూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగామి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. గతంలో ఏదైనా సమస్య వస్తే పరిష్కారానికి ఎంతో సమయం పట్టేదని, ఇప్పుడు త్వరితగతిన పరిష్కారం లభిస్తోందని అన్నారు. కాగా, విజయ్ దేవరకొండ తన జిల్లాతో పాటు స్వగ్రామానికి కూడా సాగునీరు వచ్చిందని చెబుతూ హర్షం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఉచిత విద్యుత్ లభిస్తుండడం, సాగునీరు అందుబాటులో ఉండడంతో రైతులు రెండు పంటలు వేసుకుంటున్నారని వెల్లడించారు.

కాగా, తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ వచ్చిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ కొత్త వ్యాపారం షురూ చేశారు. ఇప్పటికే ఆయన రౌడీ బ్రాండ్ పేరిట దుస్తుల రంగంలో ఉన్నారు. తాజాగా వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో భాగస్వామ్యం ద్వారా ఎలక్ట్రిక్ వాహన రంగంలో కాలుమోపారు. వాట్స్ అండ్ వోల్ట్స్ సంస్థ విద్యుత్ వాహనాలను అద్దెకు ఇస్తుంది. నిర్దేశిత రుసుము చెల్లించి నగరవాసులు ఈ ఎలక్ట్రిక్ వాహనాలను అద్దెకు తీసుకోవచ్చు. వంశీ కారుమంచి, విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి ఈ సంస్థ నిర్వాహకులు.

ఈ సంస్థ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా అని వెల్లడించారు. కాలుష్యం తగ్గించి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని, వీటి ద్వారా త్వరగా ప్రయాణించే వీలుంటుందని, డబ్బు కూడా ఆదా అవుతుందని చెప్పారు. ముఖ్యంగా, భావి తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణం అందించవచ్చని, అందుకే తాను ఈ సంస్థలో పెట్టుబడులకు ఉత్సాహం చూపానని వివరించారు.