పునర్నవి నిశ్చితార్థం నేపథ్యంలో తనను ట్యాగ్ చేస్తుండడంపై రాహుల్ సిప్లిగంజ్ స్పందన

30-10-2020 Fri 16:11
  • పునర్నవికి నిశ్చితార్థం అంటూ కథనాలు
  • పాపం రాహుల్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు
  • ఎక్స్ ట్రా ఫిట్టింగులు నాకెందుకురా నాయనా అంటూ రాహుల్ రిప్లై
Rahul Sipligunj reaction after fans tagged him in their posts

టాలీవుడ్ నటి పునర్నవికి, యూట్యూబ్ ఫిలింమేకర్ ఉద్భవ్ రఘునందన్ కు నిశ్చితార్థం జరిగినట్టు నిన్నటి నుంచి మీడియాలో విపరీతంగా కథనాలు వస్తున్నాయి. అయితే, పునర్నవితో పాటు బిగ్ బాస్-3 రియాల్టీ షోలో పాల్గొన్న ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్టు ఆసక్తి కలిగిస్తోంది. "నా భయాలను మభ్యపెట్టాను. సందేహాలకు బ్రేకప్ చెప్పాను. నా నమ్మకానికి నిశ్చితార్థం జరిగింది, ఇప్పుడు నా కలలనే పెళ్లాడాను" అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ పోస్టు చూసి అభిమానులు ఎంతో విచారం వ్యక్తం చేస్తూ... "పాపం రాహుల్" అంటూ పునర్నవి నిశ్చితార్థం నేపథ్యంలో పోస్టులు చేస్తున్నారు. దాంతో రాహుల్ మరో పోస్టు చేయాల్సి వచ్చింది. ఫ్యాన్స్ ను సున్నితంగా మందలిస్తూ... "ఎవరిదో ఎంగేజ్ మెంట్ అయితే నన్నెందుకు ట్యాగ్ చేస్తార్రా భై! ఉన్న పోరితోనే సరిపోతలేదు నాకు, ఇంకా ఎక్స్ ట్రా ఫిట్టింగులు నాకెందుకురా నాయనా" అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు, 'బేబీ' అనే తన మ్యూజిక్ వీడియో రిలీజ్ కాబోతోందని, సిద్ధంగా ఉండాలంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.