డిపార్ట్ మెంట్ లో బెట్టింగ్ కింగ్... బెట్టింగురాయుళ్ల పనిబట్టమంటే తానే ఓ ముఠాను నడిపిన కానిస్టేబుల్!

30-10-2020 Fri 15:44
  • కర్ణాటకలో హెడ్ కానిస్టేబుల్ అసాంఘిక కార్యకలాపాలు
  • యథేచ్ఛగా క్రికెట్ బెట్టింగులు
  • అరెస్ట్ చేసిన బెట్టింగురాయుళ్లతో సొంత నెట్వర్క్
Police head constable arrested after he ran a betting racket in Karnataka

కర్ణాటకలో ఓ పోలీసు క్రికెట్ బెట్టింగ్ ముఠా నడుపుతూ పట్టుబడ్డాడు. చింతామణి ప్రాంతంలో నివసించే మంజునాథ్ (42) క్రైమ్ బ్యూరో టీమ్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగులు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవడం, విచారణ జరపడం అతని విధి. కానీ తానే ఓ పెద్ద బెట్టింగ్ రాకెట్ నడిపిస్తూ పోలీసు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాడు.

ఇటీవల పోలీసులు ఓ పెద్ద బెట్టింగ్ ముఠా నాయకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ నాయకుడు పోలీసుల్లోనే ఓ బెట్టింగ్ మాఫియా లీడర్ ఉన్నాడంటూ బాంబు పేల్చాడు. దమ్ముంటే అతడ్ని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకే సవాల్ విసిరాడు. దాంతో విచారణ జరిపిన పోలీసులు హెడ్ కానిస్టేబుల్ మంజునాథ్ ను అరెస్ట్ చేశారు. విచారణలో విస్మయపరిచే వాస్తవాలు వెల్లడయ్యాయి.

ఎప్పుడైనా క్రైమ్ బ్యూరో టీమ్ బెట్టింగ్ ముఠాలను అరెస్ట్ చేస్తే, మంజునాథ్ ఆ ముఠాలోని సభ్యులను తన సొంత బెట్టింగ్ రాకెట్ కార్యకలాపాల కోసం వాడుకునేవాడు. అనేక బెట్టింగ్ ముఠాల నాయకులు కూడా ఈ హెడ్ కానిస్టేబుల్ కనుసన్నల్లోనే పందాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అంతేకాదు, ఎక్కడైనా బెట్టింగ్ ముఠాలపై దాడి చేయాల్సి వస్తే, అవతలి వారికి మంజునాథ్ ముందే సమాచారం అందించి అప్రమత్తం చేసేవాడు. అతడి కార్యకలాపాలపై అనుమానంతో నిఘా పెట్టిన పోలీసు వర్గాలు గతవారం అరెస్ట్ చేశాయి. అయితే వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని రావడంతో చికిత్స అందిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ మంజునాథ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.