వందసార్లు క్రైమ్ వీడియోలు చూసి తండ్రిని చంపి ఆధారాల్లేకుండా చేసిన మైనర్ బాలుడు!

30-10-2020 Fri 15:17
  • ఉత్తరప్రదేశ్ లో దారుణం
  • తండ్రి సోదరిని కొడుతున్నాడని హత్యకు పాల్పడిన బాలుడు
  • బాలుడికి సహకరించిన తల్లి
Minor boy killed his father after watching crime videos

ఉత్తరప్రదేశ్ లోని మధురలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడు కన్నతండ్రినే హత్య చేశాడు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చంపేందుకు 100 సార్లు క్రైమ్ పెట్రోల్ టీవీ సీరియల్ ఎపిసోడ్లు చూసినట్టు పోలీసుల విచారణలో తేలింది. 11వ తరగతి చదువుతున్న ఆ బాలుడు  తన తండ్రి మనోజ్ మిశ్రా (42)ను పక్కా ప్లాన్ తో చంపేయడం పోలీసులను కూడా నివ్వెరపోయేలా చేసింది. దీనిపై మధుర సిటీ పోలీసు ఉన్నతాధికారి ఉదయ్ మిశ్రా వివరాలు తెలిపారు.

తండ్రి తన సోదరిని తరచుగా కొడుతుండడంతో ఆ బాలుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యేవాడు. సోదరి బాధ చూడలేక తండ్రిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. దీనికి తల్లి కూడా సహకరించింది. ఈ నేపథ్యంలో, ఎవరికీ దొర్కకుండా హత్య చేయడం ఎలా అని ఆలోచించి, తన మొబైల్ ఫోన్లో క్రైమ్ పెట్రోల్ టీవీ కార్యక్రమాలను వీక్షించాడు. ఒకరోజు తండ్రిని ఇనుపరాడ్ తో తలపై మోదాడు. ఆపై తండ్రి తలకు ఓ పెద్ద వస్త్రం చుట్టి గొంతు పిసికి చంపేశాడు. ఆ వస్త్రం ముఖాన్ని, మెడను కప్పివేయడంతో బాలుడి వేలిముద్రలు తండ్రి శరీరంపై పడలేదు.

ఆపై తండ్రి శవాన్ని తల్లిసాయంతో స్కూటీపై తీసుకెళ్లి దూరంగా అటవీప్రాంతంలో పడవేశాడు. మృతదేహంపై పెట్రోలు, టాయిలెట్ క్లీనింగ్ లిక్విడ్ వేసి నిప్పంటించాడు. ఈ ఘటన జరిగింది మే నెలలో కాగా, ఇన్నాళ్లకు బయటపడింది. మనోజ్ మిశ్రా ఇస్కాన్ భక్త సమాజంలో నిధులు సేకరించే బాధ్యత నిర్వర్తించేవాడు. అతని ఆచూకీ లేకపోవడంతో ఇస్కాన్ భక్త బృందం సభ్యులు అతడి కుటుంబసభ్యులపై ఒత్తిడి తీసుకువచ్చి పోలీసు కేసు నమోదు చేయించారు.

అటు, ఇస్కాన్ లోని మనోజ్ మిశ్రా సహచరులు అటవీప్రాంతంలో పాక్షికంగా కాలిన మృతదేహాన్ని గమనించారు. కళ్లజోడు ఆధారంగా అది మనోజ్ మిశ్రాదే అని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో, మనోజ్ మిశ్రా కుమారుడ్ని పోలీసులు ఎప్పుడు పిలిచినా ఏదో వంకతో తప్పించుకుంటుండడంతో అతడిపై అనుమానంతో ఫోన్ ను తనిఖీ చేస్తే అన్నీ క్రైమ్ పెట్రోల్ వీడియోలే కనిపించాయి. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి పక్కా ఆధారాలు సంపాదించి, బాలుడే హత్య చేశాడని గుర్తించారు. ఆ కుర్రాడ్ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.