మహేశ్ సినిమాకు బాణీలు రెడీ చేస్తున్న తమన్!

30-10-2020 Fri 12:25
  • టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకులలో తమన్ 
  • పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట'
  • మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్
  • ప్రస్తుతం మ్యూజిక్ సిటింగ్స్ లో తమన్  
Thaman in music sittings for Mahesh film

ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. ఆమధ్య తను సంగీతాన్ని అందించిన 'అల వైకుంఠపురములో' చిత్రం పాటలు సాధించిన విజయం మనకు తెలిసిందే. ఆ చిత్రంలోని పాటలు యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులను కూడా సృష్టించాయి. దీంతో తమన్ డిమాండ్ ఇప్పుడు మరింత పెరిగింది. ఈ క్రమంలో మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రానికి కూడా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ కంపోజింగ్ ఇటీవల మొదలైంది. ప్రస్తుతం బాణీలను కడుతున్నట్టు తమన్ తాజాగా సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. "తాజాగా సర్కారు వారి పాట కోసం లవ్లీ బాణీలను కట్టడానికి సిటింగ్స్ జరిగాయి. సూపర్ స్టార్ మహేశ్ గారి కోసం చక్కని పాటలను ఇవ్వడానికి తగ్గా లవ్లీ సన్నివేశాలను క్రియేట్ చేసిన డార్లింగ్ పరశురామ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి' అంటూ తమన్ ట్వీట్ చేశాడు.

మరోపక్క, ఈ చిత్రం షూటింగు తొలి షెడ్యూలును అమెరికాలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్క్ పర్మిట్ వీసాల కోసం యూనిట్ ఎదురుచూస్తోంది. వీసాలు జారీ అయిన వెంటనే అమెరికా వెళ్లడానికి యూనిట్ సభ్యులు రెడీగా వున్నారు. బ్యాంక్ స్కాముల చుట్టూ అల్లిన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే.