తారస్థాయికి చేరిన కాకాణి-సోమిరెడ్డి మధ్య విభేదాలు!

30-10-2020 Fri 12:22
  • ఒకరిపై ఒకరు ఆరోపణలు
  • సోమిరెడ్డికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయన్న కాకాణి
  • సింగపూర్‌కు టిక్కెట్లు బుక్ చేస్తానన్న సోమిరెడ్డి
  • అక్కడికెళ్లి తన ఆస్తులు ఎక్కడున్నాయో చూపించాలని సవాల్
  • కాణిపాకం గుడికెళ్లి ప్రమాణం చేస్తే చాలన్న కాకాణి
somireddy slams kakani

నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య విభేదాలు కాక రేపుతున్నాయి.  వారిద్ధరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఇటీవల వీరిద్దరు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణల వల్ల ఇరు పార్టీల కార్యకర్తలు పలు గ్రామాల్లో రచ్చ చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి నాయకుడంటూ కొన్ని గ్రామాల్లో ఫ్లెక్సీలతో కొందరు ఊరేగింపు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సోమిరెడ్డికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయంటూ కాకాణి తాజాగా బహిరంగంగా ఆరోపణలు చేశారు.  యాష్ పాండ్‌లో సోమిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని కాకాణి అన్నారు.  అయితే, తనకు విదేశాల్లో ఎలాంటి ఆస్తులు లేవని, కావాలంటే సింగపూర్‌కు తానే అందరికి టికెట్లు బుక్‌ చేస్తానని, అక్కడకు వెళ్లి తనకు ఆస్తులు ఉన్నాయని నిరూపించాలని అన్నారు.

 ధాన్యం కొనుగోళ్లలో కాకాణి అక్రమాలకి పాల్పడ్డారని సోమిరెడ్డి ఆరోపించారు. అయితే, సోమిరెడ్డి అవినీతి చేయలేదని నిరూపించుకోవాలని కాకాణి మరోసారి సవాల్‌ విసిరారు. సింగపూర్‌ వరకు వెళ్లే అవసరం లేదని, చిత్తూరు జిల్లాలోని కాణిపాకం, నెల్లూరు జిల్లాలోని గోలగమూడికి వచ్చి ప్రమాణం చేయాలని ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలతో కార్యకర్తలు తిరుగుతుండడం అలజడి రేపుతోంది.