PUBG: ఇండియాతో పబ్జీకి తెగిపోయిన బంధం.. నేటి నుంచి అన్ని సేవలు బంద్!

  • ఇండియాకు శాశ్వతంగా దూరమైన పబ్జీ
  • అన్ని సేవలను ఆపేస్తున్నట్టు ప్రకటన
  • డేటా రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నామని వ్యాఖ్య
PUBG Mobile to Stop Access for Users in India from today

సరిహద్దుల వద్ద చైనా కుటిల చర్యలకు పాల్పడటంతో ఆ దేశానికి చెందిన 117 యాప్ లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇందులో పబ్జీ గేమ్ కూడా ఉంది. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి పబ్ జీ మొబైల్ ను తొలగించింది.

అయితే, అప్పటికే ఫోన్ లలో పబ్జీని ఇన్స్టాల్ చేసుకున్న వారికి మాత్రం ఇది అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయింది. ఈ రోజు నుంచి పబ్జీ సేవలన్నీ మన దేశంలో ఆగిపోనున్నాయి. పబ్జీ శాశ్వతంగా ఆగిపోనుంది. ఈ మేరకు పబ్జీ తన ఫేస్ బుక్ పేజ్ లో ప్రకటన చేసింది. అక్టోబర్ 30 నుంచి పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ కు సంబంధించిన అన్ని సేవలను రద్దు చేస్తున్నామని  తెలిపింది.

వినియోగదారుల డేటాను రక్షించడంలో తాము ఎన్నో జాగ్రత్తలను తీసుకున్నామని ఈ సందర్భంగా పబ్జీ తెలిపింది. భారత్ లో వర్తించే డేటా రక్షణ చట్టాలు, నిబంధనలకు లోబడే ఉన్నామని చెప్పింది. తమ గోప్యతా విధానంలో వెల్లడించిన విధంగా వినియోగదారులందరి గేమ్ ప్లే సమాచారం పారదర్శకంగా ప్రాసెస్ చేయబడుతుందని తెలిపింది.

ఎయిర్ టెల్, రిలయన్స్ జియో వంటి టెలికాం సంస్థల భాగస్వామ్యంతో ఇండియాలో పబ్జీ మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించబోతోందనే వార్తలు కూడా ఇటీవల వచ్చాయి. అయితే, పబ్జీ తాజా ప్రకటనతో ఇవన్నీ అవాస్తవాలేనని స్పష్టమైంది. మరోవైపు పబ్జీ ప్రకటనతో ఆ గేమ్ ప్రియులు నిరాశకు గురవుతున్నారు.

More Telugu News