అదే జరిగి ఉంటే పాక్ పని అయిపోయి ఉండేది: భారత వైమానిక మాజీ చీఫ్ ధనోవా

30-10-2020 Fri 10:06
  • అభినందన్‌ను అప్పగించడం మినహా పాక్‌కు మరో మార్గం లేకుండా పోయింది
  • రాజకీయంగా, దౌత్యపరంగా విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంది
  • భారత్ సిద్ధమైతే ఎంత ప్రమాదకరమో గుర్తించింది
Was Ready To Wipe Out Pak Brigades says BS Dhanoa
బాలాకోట్ ఉగ్రదాడి తర్వాత భారత్‌ పాక్ యుద్ధ విమానాలను వెంబడిస్తూ పొరపాటున ఆ దేశ సైనికులకు చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్‌ను తెచ్చేందుకు అవసరమైన పాక్‌ సైనిక విభాగాల్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలనుకున్నామని భారత వైమానిక దళ అప్పటి చీఫ్  బీఎస్ ధనోవా తెలిపారు.

పాక్ చేసిన దుస్సాహసం కనుక విజయవంతమై ఉంటే అది జరిగే ఉండేదని గుర్తు చేశారు. అభినందన్ వర్ధమాన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించకుంటే యుద్ధం తప్పదన్న పాక్ మంత్రి వ్యాఖ్యలతో ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వా వణికిపోయారన్న వార్తలపై స్పందించిన ధనోవా ఈ వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో వర్ధమాన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించడం మినహా పాకిస్థాన్‌కు మరో మార్గం లేకుండా పోయిందన్నారు. వర్ధమాన్‌ను బందీగా తీసుకున్న తర్వాత పాకిస్థాన్‌ దౌత్యపరంగానే కాకుండా, రాజకీయంగానూ విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొందన్నారు. భారత్ కనుక యుద్ధానికి సన్నద్ధమైతే అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో తెలుసు కాబట్టే పాక్ నేతలకు ముచ్చెమటలు పోసి ఉంటాయని ధనోవా వివరించారు.