Balakrishna: తెలంగాణ పోరాట యోధుడి పాత్రలో బాలకృష్ణ?

  • చారిత్రాత్మక పాత్రలపై బాలకృష్ణ మక్కువ 
  • ఆమధ్య 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చేసిన వైనం  
  • గోన గన్నారెడ్డి పాత్రపై దృష్టి పెట్టిన బాలయ్య
  • స్క్రిప్ట్ పనిచేస్తున్న రచయితల బృందం
Balakrishna eyes on Gona Ganna Reddy character

హీరోగా నందమూరి బాలకృష్ణది ప్రత్యేక శైలి. తండ్రిలాగే సాంఘికమైనా.. జానపదమైనా.. పౌరాణికమైనా.. చారిత్రాత్మకమైనా.. ఏ పాత్ర పోషించినా అందులో తనదైన ముద్ర వేస్తారు. ముఖ్యంగా చారిత్రాత్మక పాత్రలంటే బాలకృష్ణకు ఎంతో ఇష్టం. అలాంటి పాత్రల పోషణలో తన సత్తా చాటుతుంటారు. ఆమధ్య చేసిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చిత్రం అలాంటిదే.

ఈ క్రమంలో బాలకృష్ణ మరో చారిత్రాత్మక పాత్రపై తాజాగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ పోరాటయోధుడు, కాకతి రుద్రమ కాలం నాటి వీరుడు గోన గన్నారెడ్డి పాత్రను పోషించాలని ఆయన కోరుకుంటున్నట్టు చెబుతున్నారు. దీంతో దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనికోసం కొందరు రచయితలు, పరిశోధకులతో ఆయన ఒక బృందాన్ని ఏర్పాటు చేశారట. గన్నారెడ్డికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం తక్కువగా అందుబాటులో ఉండడంతో, మరిన్ని వివరాల కోసం ఈ బృందం ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. ఇది పూర్తయ్యాక గోన గన్నారెడ్డి ప్రాజక్టుపై ఆయన పూర్తిగా దృష్టి పెడతారని అంటున్నారు. ఇదిలావుంచితే, ఆమధ్య గుణశేఖర్ రూపొందించిన 'రుద్రమదేవి' సినిమాలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ గెస్ట్ పాత్రను పోషించిన సంగతి విదితమే!

More Telugu News