మైదానంలో మాటలయుద్ధం... పాండ్య, మోరిస్ లకు వార్నింగ్

29-10-2020 Thu 21:52
  • నిన్న ముంబయి, బెంగళూరు మధ్య మ్యాచ్
  • మోరిస్ బౌలింగ్ లో సిక్స్ కొట్టి వ్యాఖ్యలు చేసిన పాండ్య
  • తర్వాత బంతికి పాండ్య అవుట్
  • ప్రతీకారం తీర్చుకున్న మోరిస్
IPL Organizers reprimanded Hardik Pandya and Chris Morris

నిన్న ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో ముంబయి జట్టు 5 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. అయితే ముంబయి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు బ్యాట్స్ మన్ హార్దిక్ పాండ్య, బెంగళూరు బౌలర్ క్రిస్ మోరిస్ మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరిగింది.

అసలేం జరిగిందంటే.... లక్ష్యఛేదనలో ముంబయి బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మోరిస్ విసిరిన బంతికి పాండ్య సిక్స్ బాదాడు. ఆ ఊపులో పాండ్య నోటికి పని కల్పించి బౌలర్ మోరిస్ ను కవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ మరుసటి బంతికే మోరిస్ ప్రతీకారం తీర్చుకున్నాడు. పాండ్యను అవుట్ చేసిన మోరిస్ తాను కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.

ఈ సంఘటనను అంపైర్లు మ్యాచ్ ముగిసిన తర్వాత ఐపీఎల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఐపీఎల్ నిర్వాహకులు పాండ్య, మోరిస్ లను పిలిపించి వివరణ కోరారు. తాము నిబంధనలు ఉల్లంఘించినట్టు ఇరువురూ అంగీకరించడంతో మందలింపుతో సరిపెట్టారు. వారికి ఎలాంటి జరిమానా విధించలేదు.