వచ్చే సీజన్ కి కూడా ధోనీయే చెన్నై కెప్టెన్ అంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు: గౌతమ్ గంభీర్

29-10-2020 Thu 21:36
  • తాజా సీజన్ లో చెత్తగా ఆడుతున్న సీఎస్కే
  • పేలవ ఆటతీరుతో ప్లేఆఫ్స్ కు దూరం
  • అయినప్పటికీ ధోనీ నాయకత్వంపై చెన్నై యాజమాన్యం నమ్మకం
Gautam Gambhir comments on Chennai Super Kings and MS Dhoni

ఐపీఎల్ లో ప్రతి సీజన్ లోనూ ప్లేఆఫ్ దశకు చేరిన జట్టుగా గుర్తింపు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఆ ఆనవాయితీ కొనసొగించలేక చతికిలబడింది. ధోనీ నాయకత్వంలోని ఆ జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో అన్ని జట్ల కంటే తీసికట్టుగా మారింది. అయినప్పటికీ చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం ధోనీ కెప్టెన్సీపై నమ్మకం ఉంచింది. 2021 సీజన్ లోనూ ధోనీనే కెప్టెన్ అంటూ సంకేతాలు పంపుతోంది. దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు.

వచ్చే సీజన్ కు కూడా ధోనీనే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని, ఆ జట్టు కెప్టెన్ కు, యాజమాన్యానికి ఉన్న అనుబంధం అటువంటిదని అన్నాడు. "సీఎస్కే అంటే సీఎస్కేనే. మరే జట్టుకు ఇలాంటి ప్రత్యేకత ఉండదేమో. ధోనీకి ఓనర్లు ఎంతో స్వేచ్ఛనిస్తే, తన నాయకత్వ ప్రతిభతో ధోనీ వారి నుంచి ఎంతో గౌరవాన్ని అందుకోవడమే కాకుండా, అంతే గౌరవాన్ని వారికి అందించాడు. అందుకే ధోనీని కొనసాగిస్తే అందులో వింతేమీ లేదు. ధోనీ ఎంత కాలం పాటు ఆడాలనుకుంటే అంత కాలం ఆడుకోవచ్చు. వచ్చే సీజన్ లో మాత్రం ఇప్పటికంటే మెరుగైన జట్టును ఎంపిక చేసుకుంటాడని భావిస్తున్నాను. ధోనీకి చెన్నై యజమానులు ఆమాత్రం స్వేచ్ఛనివ్వడం సరైనదే. అందుకు ధోనీ అర్హుడు" అని వివరించాడు.