దుబ్బాక ఉపఎన్నిక మాకు ఒక లెక్క కాదు: కేసీఆర్

29-10-2020 Thu 17:26
  • భారీ మెజార్టీతో గెలవబోతున్నాం
  • టీఆర్ఎస్ విజయం ఇప్పటికే ఖరారైంది
  • విపక్షాల రాద్ధాంతాన్ని ఓటర్లు నమ్మరు
We are going to win in Dubbaka says KCR

దుబ్బాక ఉపఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. టీఆర్ఎస్ తరపున మంత్రి హరీశ్ రావు అంతా తానై ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా నియోజకవర్గంలో భారీ ప్రచారం నిర్వహిస్తున్నారు. అందరూ తమదే విజయం అని భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉపఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మేడ్చల్ జిల్లాలో ఈరోజు కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో ఆయన కాసేపు చిట్ చాట్ నిర్వహించారు. దుబ్బాక ఎన్నికలు తమకు ఒక లెక్కే కాదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో చిల్లర తతంగాలు నడుస్తూనే ఉంటాయని... అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. దుబ్బాకలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని అన్నారు. టీఆర్ఎస్ విజయం ఇప్పటికే ఖరారైందని చెప్పారు. విపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని ఓటర్లు నమ్మే స్థితిలో లేరని అన్నారు.