ఫ్రాన్స్ చర్చిలో ఒక మహిళ తల నరికి, మరో ఇద్దరిని హత్య చేసిన దుండగుడు

29-10-2020 Thu 15:48
  • ఫ్రాన్స్ లోని నైస్ సిటీలోని చర్చిలో దారుణం
  • 'అల్లహూ అక్బర్' అని అరుస్తూ ఉన్మాది దాడి 
  • ఇది ఉగ్రవాద చర్యేనన్న నగర మేయర్
Woman beheaded in France Church

ఫ్రాన్స్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఉన్మాదానికి అక్కడ నెత్తుటి ఏర్లు పారాయి. 'అల్లహూ అక్బర్' అని అరుస్తూ ఓ మహిళ తలను నరికి చంపిన దుండగుడు మరో ఇద్దరిని హత్య చేశాడు. ఈ ఘటన నైస్ సిటీలోని ఓ చర్చిలో జరిగింది. దీనిపై నగర మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసి మాట్లాడుతూ, ఇది ఉగ్రవాద చర్యేనని చెప్పారు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ దారుణ ఘటనలో ముగ్గురు చనిపోగా పలువురు గాయపడ్డారని చెప్పారు.

ఇటీవలే ఫ్రాన్స్ లో ఓ ఉపాధ్యాయుడి తలను ఇస్లామిక్ అతివాదులు నరికారు. ఈ ఘటన నుంచి అక్కడి ప్రజలు ఇంకా తేరుకోకముందే ఈరోజు మరో ఘటన జరిగింది. దీంతో, అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పాఠశాలలో విద్యార్థులకు మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్లను చూపిస్తున్నారంటూ వారం క్రితం ఆ హత్యకు పాల్పడ్డారు. ఇలాంటి చర్యలు దైవదూషణ కిందకు వస్తాయని హంతకులు పేర్కొన్నాడు.

 మరోవైపు, కార్టూన్లను ప్రదర్శించే హక్కు తమకు ఉందంటూ ఈ హత్యను ఖండిస్తూ నిర్వహించిన ర్యాలీల్లో నిరసనకారులు నినదించారు. ఫ్రాన్స్ పై ముస్లిం అతివాదులు కన్నేశారని... రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్టూన్లు వస్తూనే ఉంటాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఇది ముస్లిం సమాజంలో మరింత ఆగ్రహానికి కారణమైంది. ముస్లింలను రెచ్చగొడుతున్నారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా విమర్శలు గుప్పించారు.